ఏపీలో సోషల్ మీడీయాలో పోస్టింగ్ లకు ఐదు కోట్లా…?

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంటారు. నిధులు లేవంటారు.. బీద అరుపులు అరుస్తుంటారు. కేంద్ర సహకరించాలని పొలికేకలు పెడుతుంటారు. కాని హంగూ ఆర్భాటాలకు మాత్రం చంద్రబాబు సర్కార్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీ సర్కార్ సోషల్ మీడియాలో ప్రచారం కల్పించేందుకు ఏడాదికి ఖర్చు చేస్తున్నది ఎంతో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రచారం కోసం ఏడాదికి ఐడు కోట్లు ఖర్చు చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగింది. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలను, చంద్రబాబు ప్రసంగాలను, ఏయే పథకాలను అమలు చేసిందీ… వగైరా…గట్రా…వంటి విషయాలన్నీ సోషల్ మీడియాలో పెట్టేందుకు ఏపీ సర్కార్ ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసుకుంది. ఇందుకోసం ఏడాదికి ఐదు కోట్లు ఖర్చు చేస్తుంది. దీన్ని చూసి సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు నోళ్లు వెళ్లబెడుతున్నారు. నిత్యం ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే తమ శాఖకు కూడా అంత ఖర్చు కాదని, ఏడాదికి ఐదు కోట్లు ఖర్చేంటని వారే ప్రశ్నిస్తున్నారు.

వారికి తెలుగే రాదు…..

అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. గుజరాత్ లో మోడీ సక్సెస్ కు కారణమైన టీంనే ఇక్కడకు రప్పించారు. గుజరాత్ నుంచి 23 మంది సభ్యుల గల బృందం ఏపీకి చేరుకుంది. ఇందులో ముగ్గురికి ఒక్కొక్కరికి నెలకు లక్షా ఎనభై వేలు జీతంగా నిర్ణయించారు. వీరితో పాటు ఫొటో గ్రాఫర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. వీరికి ఏడాదికి జీతభత్యాల కింద మూడు కోట్లు చెల్లిస్తున్నారు. అలాగే డెవలెప్ మెంట్ టీం, సాఫ్ట్ వేర్ టీం, మెయిన్ టెన్స్ టీంకు ఏడాదికి రెండు కోట్లు చెల్లిస్తున్నారు. ఇంత మొత్తం చెల్లిస్తున్న వారికి తెలుగు భాష రాకపోవడం విశేషం. జీతంతో పాటు వసతి, సదుపాయాలను కూడా కల్పించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సమాచార శాఖ అధికారులు మాత్రం ముఖ్యమంత్రిని ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు. ప్రచారం కోసం ఇంత పెద్దయెత్తున్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఒకవైపు, ఆ ధనాన్ని ఏపీ యూత్ కు కాకుండా గుజరాత్ వాసులకు పంచిపెట్టడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియా కోసం ఏపీ ఇంత ఖర్చు చేయడం విడ్డూరంగా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1