ఏపీ ఆదాయంలో దూసుకుపోతోంది

2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7 ఆదాయార్జన ప్రభుత్వశాఖలలో 15.92 శాతం వృద్ధి నమోదైంది. అన్ని శాఖల్లోనూ గనులు భూగర్భ వనరుల శాఖ 68 శాతం వృద్ధి సాధించి ముందు వరసలో నిలిచింది. మిగిలిన శాఖల కంటే వాణిజ్య పన్నుల శాఖ రూ.9046.58 కోట్ల అత్యధిక రాబడితో ప్రథమ స్థానంలో నిలబడింది. ఈ ఏడు ప్రభుత్వ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రిజిస్ట్రేషన్ల శాఖ రూ.892.60 కోట్ల రాబడి సాధించింది. రవాణాశాఖ రూ.833.02 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. గనులు భూగర్భ వనరుల శాఖ రూ.511.69 కోట్లు ఆదాయాన్ని సాధించింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో ఈ శాఖ రూ.304.78 కోట్లు ఆదాయాన్ని మాత్రమే సాధించగలిగింది. ల్యాండ్ రెవిన్యూ శాఖ రూ.64.85 కోట్ల రాబడి ఉంది. అటవీశాఖలో రూ.12.24 కోట్ల ఆదాయాన్ని సాధించింది. మొత్తం 7 శాఖలు కలిపి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.13,244.37 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. గత ఏడాది తొలి త్రైమాసికంలో ఈ శాఖలు రూ.11,424.85 కోట్ల ఆదాయాన్ని సాధించాయి. జిల్లాలవారీగా చూస్తే రూ. 4584.95 కోట్ల ఆదాయంతో కృష్ణా జిల్లా ముందువరుసలో నిలిచింది. రూ. 3446.38 కోట్ల రాబడితో విశాఖపట్నం జిల్లా రెండవస్థానంలో ఉండగా, రూ.230.84 కోట్ల ఆదాయంతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది. వస్తు సేవల పన్ను అమలులో రాష్ట్రం ఇబ్బందులను అధిగమించగలిగిందని ఈ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 115 వస్తువుల ధరలు జీఎస్టీ ప్రభావంతో తగ్గాయని, మరో 37 వస్తువుల ధరలు మాత్రమే పెరిగాయని చెప్పారు. 180 వస్తువుల ధరలో ఎటువంటి మార్పు లేదని వివరించారు. 14 సేవలలో జీఎస్టీ ప్రభావం కనిపిస్తోందని, మరో 27 సేవలలో ఖర్చు పెరిగిందని, 10 సేవలలో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, గుడ్లు, మాంసం, బెల్లం, మైదా, గోధుమపిండి, రవ్వ, రొట్టె, వెన్న, పాలు, ఉప్పు ధరలపై జీఎస్టీ మినహాయించారని చెప్పారు. టీ, కాఫీ, పంచదార, ఎండుమిర్చి, ఎల్పీజీ గ్యాస్, పసుపు, పాలపొడి, రస్కులు, ఆయిల్ సీడ్స్, వెజిటబుల్ ఆయిల్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఇన్సులెన్ వంటి వస్తువులపై 5 శాతం మాత్రమే జీఎస్టీ అమలు చేయడం వల్ల వాటి ధరలు తగ్గి సాధారణ ప్రజానీకానికి మేలు కలిగిందని తెలిపారు. రూ.20 లక్షల వార్షిక టర్నోవర్ ఉన్న వర్తకులకు జీఎస్టీ నుంచి ఉపశమనం కల్పించారని చెప్పారు.

ప్రత్యామ్నాయాలు ఆలోచించండి….

జీఎస్టీ వల్ల రాష్ట్రానికి ఆర్థిక లోటు ఏర్పడకుండా రాబోయే 5, 10 ఏళ్ల అంచనాలు తీసుకుని ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని., రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెంచాలో ., దానికి ఏవిధమైన ఆర్థిక కార్యకలాపాలు చేపట్టాలో. అన్నది నిపుణులతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని సిఎం ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*