ఏపీ ఎంపీలు నోరు తెరిచారే…!

senior leader joined in telugudeamparty

ఒకపక్క విభజన హామీలు అమలు కాక ప్రజల్లో తలెత్తుకు తిరగలేకపోతున్న ఏపీ ఎంపీలు ఎన్నికలు దగ్గర పడటంతో నెమ్మదిగా తమ గళం విప్పడం ప్రారంభించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కనీసం రైల్వే సమస్యలు సైతం ఎంపీలు పరిష్కరించలేక పోయారన్న విమర్శలు నాలుగేళ్ళుగా ఎంపీలపై ప్రజలు, వివిధ పార్టీలు చేస్తూ వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఒకడుగు ముందుకు వేసి టిడిపి ఎంపిలను తిట్టిన తిట్టు తిట్టకుండా పార్లమెంట్లో ఏమి చేస్తున్నారని నిలదీశారు. వారి వారి వ్యాపారాలకోసమే రాజకీయాలు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. దీనిపై ఎంపీలు విరుచుకుపడినప్పుడు కూడా మీరు వ్యాపారాలు రాజకీయాలు చేయొచ్చు నేను సినిమాలు రాజకీయాలు చేస్తే తప్పా అంటూ ఎదురు దాడి సైతం చేశారు. ఆ స్థాయిలో ఎంపీల పరువు బజారున పడిన నేపథ్యంలో ఏటా రైల్వే శాఖ జీఎం స్థాయి అధికారితో బడ్జెట్ కి ముందు రొటీన్ గా జరిగే సమావేశం విజయవాడలో నిర్వహించింది.

బడ్జెట్ రెడీ అయ్యే సమయానికి తూతూ మంత్రమా ..?

ఒక పక్క బడ్జెట్ పేపర్స్ రెడీ అవుతున్న సమయానికి తూతూ మంత్రంగా రైల్వే అధికారులు సమావేశం పెట్టడం ఏమిటని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. గత నాలుగేళ్లుగా అధికారుల తంతు ఇదే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా రైల్వే బడ్జెట్ కి నెల లేదా నలభై ఐదు రోజులముందు ఈ తంతంగం జరుపుతున్నారన్నారు. ఇక రాజమండ్రి ఎంపీ మురళి మోహన్ భద్రాచలం కొవ్వూరు రైల్వే సంగతేమిటని నిలదీశారు. ఇక ఏపీ కి ఇచ్చిన రైల్వే జోన్ హామీ పై ఎంపీలంతా ముక్త కంఠంతో నినదించారు. ఏపీ నుంచి అత్యధిక ఆదాయం రైల్వే కి అందుతున్నా హామీలు అమలు అభివృద్ధిలో మొండి చెయ్యి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి కి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి తీవ్ర స్థాయిలోనే వివిధ సమస్యలపై గళమెత్తారు. చాలామంది ఎంపీలు తమ తమ ప్రాంతాలల్లో రైళ్ల నిలుపుదల, సౌకర్యాలపెంపు, ఫుట్ పాత్ బ్రిడ్జ్ లపై ప్రశ్నలు వేశారు. జీఎం స్థాయి లో పరిష్కారం కానీ సమస్యలపై కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక అధికారులకే మొరపెట్టుకున్నారు. అమరావతితో వివిధ జిల్లాల రైల్వే కనెక్టివిటీ మరింత పెంచాలని సూచించారు. వచ్చేసారి అయినా రైల్వే బడ్జెట్ సిద్ధం కాకముందు సమావేశం నిర్వహించాలని కోరారు ఎంపీలు. వీరందరికి భిన్నంగా స్పందించారు అనంతపురం ఎంపీ జెసి దివాకర రెడ్డి. రాయలసీమలో రైల్వే తీరుపై తన సంతృప్తిని వ్యక్తం చేసి ఆక్శ్చర్య పరిచారు ఆయన. అన్ని వర్గాలనుంచి విమర్శలు ఆరోపణలు రావడంతో కనీసం ఎన్నికల ముందు అయినా ఎంపిలు నోరు తెరిచినందుకు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆక్రోశం ఏ మేరకు పనిచేస్తుందో రాబోయే రైల్వే బడ్జెట్ తేల్చనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*