ఏపీ పాలిటిక్స్ కూ…విజయ్ మాల్యాకు లింకేంటి?

బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలను ముంచేసి లండన్ లో విలాసాలు అనుభవిస్తున్న విజయమాల్యా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. విజయ్ మాల్యా లండన్ లో ఉన్నప్పటికీ ఆయన ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. విజయ మాల్యాను అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఏపీ రాజకీయాలకూ, విజయ్ మాల్యాకు సంబంధం ఏంటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అందరూ విజయ్ మాల్యా పేరును ఎందుకు పఠిస్తున్నారు? వైసీపీ నేతలు కూడా ఆయన పేరును ఎందుకు జపిస్తున్నారు? ఇదే చర్చ ఏపీలో జరగుతోంది.

విజయసాయిని మాల్యాతో పోలుస్తూ…..

ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయసాయి రెడ్డిని విజయమాల్యాతో పోల్చారు. విజయసాయి రెడ్డి ఆర్థిక నేరగాడని, విజయ్ మాల్యా లాగానే ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో విజయసాయిరెడ్డికి ఏం పనని…ఆయన కేసుల మాఫీ కోసమే పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతేకాదు విజయసాయి రెడ్డి పీఎంవోను శాసిస్తున్నారని, తనపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా చంద్రబాబు ఆరోపించారు. విజయ్ మాల్యా కంటే ఆర్థిక నేరగాడు విజయసాయి అని ఆయన తీవ్రస్వరంతోనే విరుచుకుపడ్డారు.

మాల్యాను చంద్రబాబు కలిశారంటూ….

ఇక తాజాగా విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఏడాది మార్చి నెలలో చంద్రబాబు లండన్ కు వెళ్లి విజయ్ మాల్యాను కలిశారన్నారు. విజయ్ మాల్యాను చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలన్నారు విజయసాయిరెడ్డి. 2014 ఎన్నికలకు ముందు విజయ్ మాల్యా నుంచి టీడీపీ 150 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా తీసుకుందని కూడా విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు విజయ్ మాల్యాను కలిసిన తేదీలను కూడా ఆయన చెప్పడం విశేషం. అయితే దీనికి టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. విజయ్ మాల్యాను కలిసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించింది.

ఆర్థిక నేరగాడితో పోల్చుకుంటూ….

ఇంతకూ ఏపీకి సంబంధం లేని విజయ్ మాల్యా ఏపీ రాజకీయాల్లోకి ఎందుకు దూసుకొచ్చాడన్నదే ప్రశ్న. ఆయన లండన్ లో ఉంటూ మూడో పెళ్లి చేసుకుని విలాసవంతంగా గడుపుతుంటే, ఏపీలోని ప్రధాన పార్టీలు మాత్రం విజయ్ మాల్యాను ఉదహరిస్తూ రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నాయి. తొమ్మిది వేల కోట్ల మేరకు బ్యాంకులను ముంచి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా మాత్రం ఎంచక్కా కులాసాగా ఉంటే, ఇక్కడ మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆయన జపం చేయడం విశేషం. విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాడితో ఒకరిని ఒకరు పోల్చుకుంటూ పండగ చేసుకుంటున్నారు. దటీజ్ ఆంధ్రప్రదేశ్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*