ఏపీ బిజెపి అధ్యక్షుడు ఎవరు …?జోరుగా బెట్టింగ్ లు

బెట్టింగ్ … ఏ చిన్న సందర్భం ఉన్నా దానిపై కోట్ల రూపాయల్లో పందేలు కాసి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవడం లేదా కోటీశ్వరులు సైతం బికారులుగా మారిపోవడం సర్వ సాధారణం అయిపొయింది ఏపీలో. సాధారణంగా ఎన్నికల ఫలితాలపై మాత్రమే నడిచే పందేలు ప్రతి అంశంలోనూ నిర్వహిస్తూ నాలుగు రూపాయలు వెనకేస్తున్నారు తెలివైనవాళ్లు. ఇప్పుడు బెట్టింగ్ బాబులు బిజెపి అధ్యక్షుడు ఎవరు అవుతారనే అంశంపై పందేలు మొదలు పెట్టారు. ఎపి లోని ప్రత్యేక రాజకీయాల దృష్ట్యా అధ్యక్షుడి మార్పు అనివార్యం అయింది. ఎప్పటినుంచో పెండింగ్ లో వున్న ఈ అంశం పై కమలం అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టలేదు. ఎప్పుడైతే ఎన్ డి ఏ నుంచి మిత్రపక్షం టిడిపి వైదొలిగిందో బిజెపి వేగంగా అడుగులు వేస్తూ పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు మొదలు పెట్టింది.

రాంమాధవ్ రావడంతో ….

ఎపి ఇంచార్జ్ గా రాంమాధవ్ ను అమిత్ షా ఎప్పుడైతే నియమించారో ఇక ఆ పార్టీ తీరుతెన్నులు విభిన్నంగా మారుతూ వస్తున్నాయి. రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఆయన కసరత్తు మొదలు పెట్టారు. కోస్తాలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నూతన సారధిగా బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. దాంతో బీజేపీలోని కాపు నేతల్లో ఎవరు రాష్ట్ర పార్టీ అధ్యక్ష కుర్చీ ఎక్కుతారనే అంచనాలు మొదలయ్యాయి.

రేసులో సోము, కన్నా, ఆకుల, పైడికొండల ….

బీజేపీలో ప్రస్తుతం ఫామ్ లో వున్న నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఆయన తరువాత కన్నా లక్ష్మి నారాయణ. ఆయన వెనుక పైడికొండల మాణిక్యాల రావు, ఆకుల సత్యనారాయణ ఉన్నారు. మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి పేరు నిన్న మొన్నటి వరకు నడిచినా ఆమె సేవలు మరోరకంగా బిజెపి ఉపయోగిస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరందరిపై బెట్టింగ్ లు జోరుగా మొదలు అయిపోయాయి. కోస్తా ప్రాంతంలోని గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు చిత్తూరు వరకు జోరుగా ఊహాగానాలు, బెట్టింగ్ లు నడవడం చర్చనీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*