నంద్యాలతో నారా నాయకత్వంపై అనుమానాలు తొలిగినట్లేనా?

ఒక్క విజయం వంద ఏనుగుల బలాన్నిస్తుంది. క్యాడర్ లో కాన్ఫిడెన్సు నింపుతుంది. నాయకుని విలువ పెంచుతుంది. ఒక వైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణం. మరోవైపు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తున్న వర్గాల కోటల్లో ప్రజాస్వామ్య సమరం. ఇంకోవైపు కేంద్రంలో అండగా ఉంటున్న పక్షం నుంచి భిన్నసంకేతాలు.ఈ సంక్షోభం గట్టెక్కకపోతే పతనం దిశలోనే ప్రస్థానం. పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తప్పవు. ఇటువంటి క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ తాజాగా సాధించిన రెండు విజయాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. నాయకత్వ సామర్థ్యంపై నెలకొంటున్న అనుమానాలను పటాపంచలు చేశాయి. రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ వ్యాపిస్తున్న సందేహాలు, శషభిషలకు చెక్ పెట్టేశాయి. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనవిజయాలు పెద్దగా లేవు. విపక్షం తన బలాన్ని మించి చేసుకుంటున్న ప్రచారాన్ని ఒక దశలో తెలుగుదేశం పార్టీలోని వర్గాలే నమ్మకతప్పని స్థితి.

ఎన్నో అనుమానాలు…..

కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ వివిధ పథకాల అమలు, రైతు రుణమాఫీ , కాపులకు రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి వంటి విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అధికార పక్షానికి ప్రతికూల పవనాలు వీయడం సహజమే. అయితే దానిని రెండింతలు,మూడింతలు చేసి ప్రధాన ప్రతిపక్షం ప్రచార దుమారానికి కొంతకాలంగా శ్రీకారం చుట్టింది. పైపెచ్చు సామాజిక మాధ్యమాల్లో అంకెల సహా తమ ఆధిక్యతను నిరూపించుకునే ప్రయత్నం చేసింది. కేంద్రంలోని ఇంటిలిజెన్సు వర్గాలు, రాష్ట్రప్రభుత్వ అధీనంలోని ఇంటిలిజెన్సు వర్గాలు కూడా నంద్యాల, కాకినాడ వంటి చోట్ల తెలుగుదేశం ఓడిపోయే అవకాశాలున్నట్లు నివేదిక ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. వీటన్నిటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికల గోదాలోకి దిగింది. నిజానికి ఈ సమరం తెలుగుదేశానికి ఏమాత్రం ఇష్టం లేదు. చట్టసభల సభ్యులు ఎవరేని చనిపోతే ఆరునెలలలోపు ఎన్నిక జరపడం రాజ్యాంగపరంగా విద్యుక్తధర్మం. ఇక కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక న్యాయస్థానాల జోక్యంతో తప్పనిసరి తంతుగా మారింది. ఒక రకంగా రెండు చోట్లా ప్రతికూల పరిస్థితులే.

తప్పనిస్థితిలో పోరాటం…..

కాపు రిజర్వేషన్లపై పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముద్రగడ పద్మనాభం ఇంటి నుంచే తీవ్రస్థాయి ఆందోళన చేస్తూ సామాజిక వర్గంలో కలకలం రేపుతున్నారు. కాకినాడ మునిసిపల్ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికలో ముస్లిం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఆతర్వాత స్థానంలో బలిజ(కాపు) ఓట్లు ప్రాధాన్యం వహిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశానికి ముస్లిం ఓట్లు దూరమైతే, రిజర్వేషన్లు అమలు చేయనందుకు కాపు,బలిజ వర్గాలు ప్రతీకారం తీర్చుకుంటే తెలుగుదేశం విజయం గల్లంతే. ఇవే లెక్కలతో తెలుగుదేశం పార్టీ గట్టెక్కడం కష్టమేననే అంచనాలు వెలువడ్డాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటించినా తెలుగుదేశం శ్రేణులు కూడా ఇదే ఆలోచనకు వచ్చేశాయి. కానీ రాజకీయాలు అంతుచిక్కని క్రీడ. ఎవరిని విజయం వరిస్తుందో, ఎవరిని పరాజయం పలకరిస్తుందో చెప్పడం తలపండినవారికి కూడా సాధ్యం కాదు. నంద్యాల, కాకినాడ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. పైపై సర్వేలు, పెద్ద నాయకుల భిన్నస్వరాల సంగతెలా ఉన్నా గ్రౌండ్ లెవెల్ లో తెలుగుదేశం పటిష్టంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోగల సామర్థ్యాన్ని విపక్షం ఇంకా ఒడిసి పట్టుకోలేదు. సంక్షోభం నుంచి అవకాశం దిశగా , ప్రతికూలత నుంచి సానుకూలతగా మలచుకోవడమే రాజకీయం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్య సందర్భోచితం. 2014లో రాష్ట్రం విడిపోయే దశలో పదేళ్లుగా అధికారంలో లేని తెలుగుదేశం పెను సంక్షోభంలో ఉంది. రాష్ట్రం విడిపోవడమనే క్లిష్ట పరిస్థితిని అవకాశంగా మలచుకుని అధికారం సాధించింది. వై.సి.పి కి మంచి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ బీజేపీ, పవన్ లతో జట్టుకట్టి అనుభవం అనే పాచిక ప్రయోగించి ప్రతికూలతను సానుకూలతగా మార్చుకుంది తెలుగుదేశం. అదే విజయంగా రూపుదాల్చింది. ఇప్పుడు నంద్యాల, కాకినాడల్లోనూ అదే ప్రయోగం ఫలించింది. పొలిటికల్ మేనేజ్ మెంట్, పబ్లిక్ మేనేజ్ మెంట్, పోల్ మేనేజ్ మెంట్ త్రిసూత్రాలుగా పార్టీ పయనించాలంటూ చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడాన్ని పరగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక దశలో తెలుగుదేశం పార్టీ బలం క్షీణిస్తోందన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలో వై.సి.పితో జట్టుకడుతుందనే భావన కూడా తలెత్తింది. జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలవడం, చంద్రబాబుకు అండగా ఉన్న వెంకయ్య నాయుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడం, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నాలక్ష్మీనారాయణ వంటి బీజేపీ కొత్త దళమంతా చంద్రబాబునాయుడికి వ్యతిరేక వర్గం కావడంతో మైత్రిని విడదీసేస్తారనే ప్రబలమైన నమ్మకం ఏర్పడింది.

అసమ్మతి సద్దుమణిగేలా…..

నంద్యాల , కాకినాడల్లో టీడీపీ ఓటమి పాలైతే అధికారంలోకి వచ్చే పక్షంతోనే కలిసినడవాలనే కొత్త వాదనకు బీజేపీలో బలం చేకూరేది. తద్వారా టీడీపీ, కమలం దోస్తీపైన కూడా ప్రభావం పడేది. ఎన్నికల్లో స్పష్టమైన తీర్పుతో బీజేపీలోని తెలుగుదేశం వ్యతిరేక శక్తుల మాటకు విలువ పడిపోయింది. విలువైన మిత్రపక్షంగా తెలుగుదేశాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి గుర్తించి ట్వీట్ చేసేశారు. దీనర్థం 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసే నడవబోతున్నాయి. చంద్రబాబుకు గండం గడిచిపోయింది. పార్టీలో కొత్తగా చేరిన వై.సి.పి. ఎమ్మెల్యేలు, టీడీపీ పాతకాపుల మధ్య పొసగడం లేదు. ఏడాదిన్నర కాలంగా వై.సి.పి ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ ఛార్జులు ఉన్న నియోజకవర్గాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాత్కాలికంగా సర్దుబాటు చేయడమే తప్ప పార్టీ అధినేత కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని సరిదిద్దడానికి క్రమశిక్షణ చర్యల విషయంలో వెనుకంజ వేయడం కనిపిస్తోంది. ప్రజామద్దతు విషయంలో నెలకొన్న సందేహాలే ఇందుకు కారణం. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే నియోజకవర్గ స్థాయి నాయకుల మీద ఆధారపడి పార్టీ బలాన్ని కాపాడుకోవాలనే భావనతో విభేదాల పట్ల ఉదాసీనంగా ఉంటూ చంద్రబాబు నాయుడు స్థానిక నాయకులను ఉపేక్షిస్తున్నారు. నంద్యాల ఎన్నిక ఈ విషయంలో కూడా పార్టీ నాయకత్వానికి భరోసానిచ్చింది. బలమైన ప్రత్యర్థులు బరిలో నిలిచినా, ప్రతిపక్ష నేత పక్షం రోజులపాటు ప్రచారం చేసినా టీడీపీ గెలిచింది. దీంతో పార్టీలోని అసమ్మతి స్వరాలు సద్దుమణిగాయి.ప్రస్తుతం తోక జాడించేందుకు జంకుతున్నాయి. ఈ రకంగా చూస్తే చంద్రబాబుకు చాలావరకూ తలనొప్పి తప్పిపోయినట్టే. పార్టీపైన కూడా పూర్తిస్థాయి పట్టు చిక్కింది. టిక్కెట్లు లభించకపోయినా ఏదో ఒక పదవి వస్తుందిలే అన్న భరోసాతో భవిష్యత్తులో నియోజకవర్గ నాయకులు రాజీ పడకతప్పదు. రాజకీయ వ్యూహకర్త అయిన చంద్రబాబు ఈ సానుకూలతను కచ్చితంగా సమర్థంగా వినియోగించుకుంటాడు. నంద్యాల , కాకినాడల్లో పరిస్థితులు ప్రతికూలిస్తే అధికారయంత్రాంగం కూడా కట్టుతప్పి ఉండేది. కొత్త పాలన వచ్చేస్తోందంటూ యంత్రాంగమే కోడై కూసేది. ఆ విపత్తు తప్పిపోయింది. మొత్తమ్మీద అటు ప్రభుత్వం, ఇటు పార్టీని అదుపాజ్ణల్లో పెట్టేందుకు చంద్రబాబుకు సువర్ణావకాశం లభించింది. మరో ఏడాదిన్నరపాటు తన కనుసన్నల్లో పాలనను శాసించుకోవచ్చు.
-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*