ఒక దెబ్బకు మూడు పిట్టల్న కొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ..!

ఏపీలో ప్రజా తీర్పుతో గత ఎన్నికల్లో మట్టికొట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలు రూపొందించి తిరిగి లేచి ప్రజా మన్ననలు పొందాలని చూస్తుంది. అందుకోసం ఆ పార్టీ పార్లమెంటును వేదికగా చేసుకుంటుంది. విభజన హామీల అమలు చేయడంలో బిజెపి నిర్లక్ష్యం నిలదీయలేని టిడిపి, వైసీపీల బలహీనతల నిగ్గు తేల్చాలన్నది కాంగ్రెస్ ఎత్తుగడ. దీనివల్ల ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొడతామని ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ వ్యూహాలకు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పదును పెడితే, ఏపీసీసీ అధ్యక్షుడు ఆయనకు సహకారాన్ని అందించి మీడియా లో మూడు పార్టీల గుట్టు విప్పి అల్లరి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కాంగ్రెస్ వ్యూహం ఏమిటి ..?

విభజన హామీల్లో ముఖ్యమైనవి బడ్జెట్ లోటు పూర్తిగా కేంద్రం భర్తీ చేయడం, రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చడం, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి 100 శాతం నిధులతో సకాలంలో పూర్తి చేయడం ఇంకా అనేక హామీల్లో ఒక్కటి సంపూర్తి కాలేదు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇస్తామని యుపిఎ సర్కార్ పార్లమెంట్ సాక్షిగా పెట్టిన చట్టానికి ఆతీ గతిలేకుండా పోయింది. హోదా అంశం చట్టం చేయకపోవడంతో దాన్ని సాకుగా చూపి దాని బదులు ప్యాకేజి ఇస్తామని ఆ మాట తప్పింది బిజెపి. వీటన్నింటిని అడిగి కడిగేయాలిసిన తెలుగుదేశం నోరెత్తకుండా రాబోయే ఎన్నికల్లో ఈ అంశాలే బూచిగా చూపి పొత్తుకు రామ్ రామ్ చెప్పి రాజకీయ లబ్ది పొందాలని భావిస్తుంది. ఇక ప్రతిపక్ష వైసిపి పరిస్థితి మరీ ఘోరం. అధినేతపై కేసులు ఉన్నందున కేంద్రంపై గట్టిగా స్పందించి పోరాడలేని పరిస్థితి వారిది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంట్ లో ఈ మూడు పక్షాల నాటకాన్ని బయట పెట్టాలని భావిస్తుంది. అందుకోసం 184 వ నిబంధన కింద లోక్ సభలో చర్చ చేపట్టేందుకు సిద్ధమైంది.

184 వల్ల జరిగేది ఏమిటి …?

పార్లమెంట్ లో 184 వ నిబంధన కింద ఏ పార్టీ అయినా ఒక అంశంపై చర్చకు పట్టుబట్టి ఓటింగ్ సైతం కోరవచ్చు. ఆ నిబంధన కింద కనుక చర్చ మొదలైతే అన్ని పార్టీలు ఈ చర్చలో పాల్గొంటాయి. దేశ వ్యాప్తంగా ఏపీ లో బిజెపి నమ్మించి మోసం చేసింది అనే అంశం పార్లమెంట్ లో చర్చించే అవకాశముంటుంది. ఆ చర్చలో బిజెపి, టిడిపి, వైసిపి తమ వైఖరి తేటతెల్లం చేయక తప్పదు. ఓటింగ్ జరిగితే ఈ మూడు పార్టీల ధోరణి మరింతగా ప్రజల్లో స్పష్టం అవుతుంది. పార్లమెంట్ చేసిన చట్టం అమలు చేయాలా అవసరం లేదా అనే అంశం పై క్లారిటీ దొరుకుతుంది. విభజన హామీలపై కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి తో బాటు టిడిపి, వైసీపీల ముసుగు తొలగించే అవకాశాలు ఉంటాయి. అందుకే 184 నిబంధనపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లోక్ సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ను కెవిపి, రఘువీరా బృందం కలిసి ఏపీ కాంగ్రెస్ నిర్ణయాలను ఆయన ముందు ఉంచాయి. రాహుల్ ను సైతం కలిసి విషయాన్ని ఆయనకు వివరిస్తామని చెబుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. మరి బిజెపి ఈ చర్చకు సుముఖత వ్యక్తం చేస్తుందా ఒక వేళ అంగీకరిస్తే ఓటింగ్ జరగడానికి సిద్ధంగా ఉంటుందా అన్నది ఆసక్తి కరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*