ఒవైసీపై పోటీకి ఫైర్‌బ్రాండ్‌… ?

హైద‌రాబాద్‌పై బీజేపీ క‌న్నేసింది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని న‌యా వ్యూహం ర‌చిస్తోంది. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు పావులు క‌దుపుతోంది. ఇందుకు ఇప్ప‌టి నుంచి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. ఈసారి బ‌ల‌మైన అభ్య‌ర్థిని రంగంలోకి దింపాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి నాలుగు ప‌ర్యాయాలుగా గెలుస్తూ వ‌స్తున్న ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీని ఓడించ‌డ‌మే ధ్యేయంగా క‌మ‌ల‌ద‌ళం క‌దులుతోంది. ముస్లిం ఓట్ల‌తోనే గెలుస్తూ వస్తున్న ఒవైసీని ఎదుర్కొనేందుకు హిందుత్వవాదిగా నిత్యం వార్తల్లో ఉంటున్నగోషామ‌హ‌ల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బరిలోకి దించ‌బోతోంద‌ని తెలుస్తోంది.

షా పర్యటనలో కూడా…….

ఇటీవ‌ల హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా వ‌ద్ద కూడా ఈ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతామ‌ని క‌మ‌లం నేత‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌చైత‌న్య యాత్ర చేప‌ట్టి జోష్‌మీద ఉన్నారు. కానీ, అమిత్ షా మాత్రం రాష్ట్ర నేత‌ల‌కు షాక్ ఇచ్చారు. ఈ స్థాయి ప‌నితీరుతో వచ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేర‌ని.. ఇంకా క‌ష్ట‌ప‌డాల‌ని గ‌ట్టిగా క్లాస్ తీసుకున్న‌ట్లు తెలిసింది. ఇందులో ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌పై దృష్టి సారించాల‌ని, మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా ప‌నిచేయాల‌ని ఆయ‌న ఆదేశించిన‌ట్లు సమాచారం.

అసద్ సవాల్ కు……

ఈక్ర‌మంలో రాష్ట్ర నేత‌లు వ్యూహాత్మ‌కంగా హైద‌రాబాద్ పార్ల‌మెంటు స్థానంపై క‌న్నేశార‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే అస‌దుద్దీన్ ఓవైసీ చేసిన స‌వాల్‌తో క‌మ‌ల‌ద‌ళం మ‌రింత ప‌ట్టుద‌ల‌గా ఉన్న‌ట్లు తెలిసింది. ప్రధాని మోడీకి దమ్ముంటే హైదరాబాద్‌ నుంచి గెలవాలని ఇటీవల అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్‌ విసిరిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ పార్ల‌మెంటు స్థానంలో ప్ర‌త్యేక వ్యూహం ర‌చిస్తోంది. ముస్లిం ఓట్ల‌నే ఆయుధంగా గెలుస్తున్న ఓవైసీనీ ఎదుర్కొనాలంటే ప‌చ్చి హిందుత్వవాది రాజాసింగ్‌ను బ‌రిలోకి దింపాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో హిందూ ఓట్లను దక్కించుకోగలిగితే ఒవైసీని ఓడించడం పెద్ద సమస్య కాదని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు.

దశాబ్దాలుగా ఒవైసీ ఫ్యామిలీకి…..

తెలంగాణ రాజ‌ధాని అయిన ఈ కీల‌క సీటు ద‌శాబ్దాలుగా ఓవైసీ ఫ్యామిలీకి కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది. అస‌దుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ స‌లావుద్దీన్ ఓవైసీ ఇక్క‌డ నుంచి ఏకంగా ఆరుసార్లు గెలిచి డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఇక గ‌త మూడు ఎన్నిక‌ల్లో ఆయ‌న పెద్ద కుమారుడు అస‌దుద్దీన్ ఓవైసీ భారీ మెజార్టీల‌తో గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టారు. అయితే పార్ల‌మెంటు సీటు ప‌రిధిలో ఉన్న గోషామ‌హాల్ నుంచి రాజాసింగ్ ఏకంగా 70 వేల పైచిలుకు మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఎంపీగా అస‌ద్ గెలిచినా గోషామ‌హాల్‌లో మాత్రం బీజేపీ అభ్య‌ర్థి భ‌గ‌వంత‌రావుకు 73 వేల పైచిలుకు మెజార్టీ ల‌భించింది.

సులభమేనంటున్న కమలం పార్టీ…….

అయితే, గతంలోనూ బద్దం బాల్‌రెడ్డి, ఎం.వెంకయ్యనాయుడు వంటి అగ్రనేతలు ఇక్క‌డి నుంచి గట్టి పోటీ ఇచ్చి కొద్ది తేడాతో ఓడిపోయారు. ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్ పార్ల‌మెంటు ఈ స్థానాన్ని దక్కించుకోవడం సుల‌భ‌మేన‌ని అంచ‌నా వేస్తున్నార‌ట‌. నోరు తెరిస్తే ఒవైసీని ఏకిపారేసే రాజాసింగ్‌కు పోటీ సిద్ధంగా ఉండాల‌నే సంకేతాలు అమిత్‌షా నుంచి కూడా అందాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. అయితే, ఇందుకు తానూ సిద్ధంగానే ఉన్నాన‌ని రాజాసింగ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈసారైనా పార్ల‌మెంటు స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుందో లేదో చూడాలి మ‌రి.