ఓయూ అంటే కేసీఆర్ కు ఎందుకంత కోపం?

ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించడం పట్ల ఓయూ విద్యార్థులు మండిపడుతున్నారు. కేవలం మూడు రోజులపాటు ఓయూ శతాబ్ది ఉత్సవాలను జరిపి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. ఓయూపై ప్రభుత్వానికి ఉన్న అక్కసు ఏంటో దీన్ని బట్టే తెలుస్తుందని ఓయూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా ఏడాది పాటు నిర్వహిస్తామని చెప్పింది. ఇందుకోసం ఓయూకు 200 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన ఉత్సవాలు మూడురోజులకే పరిమితమయ్యాయంటున్నారు విద్యార్థులు. అంతేకాకుండా ఓయూకు కేటాయించిన 200 కోట్ల మాటేమిటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

200 కోట్లు అన్నారు…నిధుల విడుదల ఏదీ?

పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు విరుచుకుపడుతున్నారు. ఆర్భాటంగా రెండు వందల కోట్లు ప్రకటించిన ప్రభుత్వం కనీసం అందులో ఒక శాతాన్ని కూడా ఖర్చు చేయలేదని చెబుతున్నారు. ఈ నిధులతో కొత్త హాస్టల్స్ నిర్మాణం, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే ఉత్సవాలకు కనీసం 20 కోట్లు కూడా విడుదల చేయలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకోసమే ఓయూలోకి అడుగుపెట్టడానికి మంత్రులు వెనకడుగు వేస్తున్నారంటున్నారు విద్యార్థులు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటించిన విధంగా నిధులు విడుదల చేయకుంటే మరోసారి ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఓయూ వైస్ ఛాన్సిలర్ మాత్రం ముందుగా అనుకున్నట్లుగానే శతాబ్ది ఉత్సవాలను జరుపుతున్నామని చెప్పారు. మీడియాలో ప్రచారం లేకనే ఉత్సవాల గురించి తెలియడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే నిధుల విడుదల విష‍యం ఇంకా తనకు తెలియదని ఆయన చెప్పారు. మొత్తం మీద ఓయూ విద్యార్థులు కేసీఆర్ సర్కార్ పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేయకుంటే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1