కడియం ప్రస్థానం ముగిసినట్లేనా…!

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖమంత్రి రాజకీయ సన్యాసం చేయబోతున్నారు. ఆయనే స్వయంగా ఈ విషయం చెప్పడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తాను 2021 తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ కావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. తాను రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, ఇక రాజకీయాల్లో కొనసాగలేనని చెప్పారు. కాగా కడియం శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం 2021 వరకూ ఉండటంతో ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా కడియం ఆలోచనల వెనక ఆయన వారసులను రాజకీయాల్లోకి దించేందుకేనన్నది స్పష్టమైంది. కడియం శ్రీహరి దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీని వదలి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరిని పదవికి రాజీనామా చేయించి మరీ కేసీఆర్ ఆయన్ను ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.

కుమార్తె కోసమేనా….?

కాగా కడియం శ్రీహరి కుమార్తె కావ్య రాజకీయ అరంగేట్రం కోసమే ఆయన ఈ ప్రకటనచేసినట్లు చెబుతున్నారు. కావ్య వైద్య వృత్తిలో ఉన్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో కావ్య ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ సీటును కావ్యకు ఇప్పించాలన్నది కడియం ఆలోచన. ఈ మేరకు గత కొద్దినెలలుగా ఆయన ఘన్ పూర్ లో అనేకసార్లు పర్యటిస్తున్నారు. ప్రస్తుత స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై కేసీఆర్ అసంతృప్తిగా ఉండటంతో ఆ సీటు తన పెద్దకూతురు కావ్య కు ఇస్తారని కడియం గట్టి నమ్మకంతో ఉన్నారు. మొత్తం మీద కడియం తన మనసులో మాటను చెప్పేశారు. ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పడంతో వరంగల్ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1