కన్నడ రాజకీయంలో వీళ్లే కీలకమా?

కర్ణాటకలో ప్రతి ఓటూ కీలకం కానుంది. కేవలం కన్నడ ఓట్లే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లపై కూడా కాంగ్రెస్, బీజేపీ కన్నేశాయి. కర్ణాటకలో ఉండే వాతావరణం, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో వివిధ రాష్ట్రాల ప్రజలు ఎప్పుడో అక్కడకు వెళ్లి స్థిరపడిపోయారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో కేవలం కన్నడిగులపైనే కాకుండా కన్నడేతరుల మద్దతును పొందేందుకు రెండు పార్టీలూ ప్రయత్నాలు ప్రారంభించనున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల పాటు కన్నడ రాష్ట్రంలో పర్యటించారు. ఆయన జరిపిన పార్టీ సమీక్షలో కన్నడేతర ఓట్లపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలని అమిత్ షా ఆదేశించారు.

మురళీధరరావుపై బాధ్యతలు…

కర్ణాటక కమలం పార్టీకి వ్యవహారాల ఇన్ ఛార్జిగా మురళీధరరావు వ్యవహరిస్తున్నారు. ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధినాయకత్వానికి నివేదికలు అందిస్తూనే ఉన్నారు. కాగా కర్ణాటకలో తెలుగు ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువే. బెంగళూరు, మైసూరు, తుమకూరు, బళ్లారి, రాయచూరు, కలబురిగి, యాదగిరి, తుమకూరు, చిక్ బళ్లాపూర్ జిల్లాల్లో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో సయితం తెలుగు వారిని అన్ని పార్టీలు ప్రచారంలోకి దింపాయి. బీజేపీ తరుపున పవన్ కల్యాణ్ కూడా గత ఎన్నికల్లో ప్రచారం చేశారు.

తెలుగునేతలతో ప్రచారం….

అయితే ఈసారి తెలుగు ప్రముఖులను ప్రచారంలోకి దించే విషయాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నేతలతో పాటు సినిమా స్టార్లను కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించింది. పురంద్రీశ్వరి త్వరలోనే కన్నడ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నీ బాగుంటే ఎన్నికల సమయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేత కూడా ప్రచారం చేయించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అలాగే తెలుగుతో పాటు మరాఠి, మళయాళీ, తమిళ భాషలు మాట్లాడేవారు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రాలకు చెందిన నేతలను కూడా ప్రచారంలోకి దింపనున్నారు.

పురంద్రీశ్వరి సమన్వయం….

తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రచార బాధ్యతను పురంద్రీశ్వరికి అప్పగించాలన్న యోచనలో ఉన్నారు. పురంద్రీశ్వరి అందరి నేతలను సమన్వయం చేసుకుని ప్రచారాని తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటకలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న కమలనాధులు ప్రతి ఓటూ కీలకంగా భావిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో 28 స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఆ స్థానాల పరిధిలో ఉన్న నియోజకవర్గాలు గెలిస్తే చాలు. సునాయాసంగా విజయం సాధించినట్లే. ఇప్పుడు అదే ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. మరి తెలుగు ఓటరు తీర్పు ఎలా ఉంటుందో?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1