కన్నడ లెక్కలు తిరగేస్తే?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు… ఆ రాష్ట్రానికో… పొరుగు రాష్ఠ్రాలకో పరిమితమైన అంశం కాదు. దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. అందువల్లే అక్కడివ పరిస్థితులను అన్ని పార్టీలూ సునిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రతి చిన్న అంశాన్ని లోతుగా విశ్లేషిస్తున్నాయి. 2013 నాటి అసెంబ్లీ ఎన్నికలు, 2014 నాటి లోక్ సభ ఎన్నికల ఫలితాలు, ఓట్ల, సీట్ల శాతాన్ని లెక్కగడుతూ అంచనాలు వేసుకుంటున్నాయి. ఎవరికి వారు అంతిమ ఫలితాన్ని తమ కోణంలో ఆలోచిస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికల్లో….

ఒక్కసారి చరిత్రలోకి వెళితే…. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. జనతాదళ్ (ఎస్), భారతీయ జనతాపార్టీలను చెరి 40 స్థానాలకు పరిమితం చేసిన కాంగ్రెస్ 120కి పైగా స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఈ లెక్కన చూస్తే ఏడాది తర్వాత 2014 లోక్ సభ ఎన్నికల్లో హస్తం పార్టీ ఆధిక్యం సాధించాల్సి ఉంది. అత్యధిక లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో పడాల్సి ఉంది. కాని అలా జరగలేదు. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్ సభ స్థానాలకు గాను కేవలం 9 స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. బీజేపీ 17 స్థానాలను తమ ఖాతాలో వేసుకుని విజయ ఢంకా మోగించింది. మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ (ఎస్) కేవలం రెండు స్థానాలకే పరిమితమయింది. దేవెగౌడ తన సొంత నియోజకవర్గంమైన హసన్ నియోజకవర్గంతో పాటు, మాండ్యా లోక్ సభ స్థానంలో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. 2013 మేలో అంటే ఏడాది క్రితమే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ కనీసం సగానికి పైగా స్థానాలు సాధించాల్సి ఉంది. కేవలం పార్టీ దిగ్గజనాయకులు మాత్రమే గట్టెక్కారు. బీదర్ నుంచి ప్రస్తుత లోక్ సభ లో పార్టీ నేత మల్లికార్ఝున ఖర్గే, చిక్ బళ్లాపూర నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ వంటి నాయకులు మాత్రమే విజయం సాధించగలిగారు. అంటే 2013 అసెంబ్లీ, 2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలకు పొంతనే లేదన్న సంగతి అర్థమవుతోంది.

అదే ప్రామాణికమైతే….

ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఉంది. అదే 2014 లోక్ సభ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకుంటే ప్రస్తుత అసెంబ్లీఎన్నికల్లో కమలనాధుల విజయం ఖాయం కావాలి. నిశ్చింతగా ఉండాలి. అంతగా హైరానా పడాల్సిన అవసరం లేదు. నాటి ఎన్నికల్లో బీజేపీ 43 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 40.8, జనతాదళ్ (ఎస్) 11 శాతం ఓట్లను సాధించాయి. ఈ ప్రాతిపదికన బీజేపీ 17, కాంగ్రెస్ 9, జనతాదళ్ (ఎస్) రెండు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ ఓట్లు, సీట్లు ప్రాతిపదికన చూస్తే బీజేపీ కనీసం 115 నుంచి 120 అసెంబ్లీ స్థానాలు సాధించాల్సి ఉంది. కాంగ్రెస్ 77 స్థానాలకు పరిమితం కావాల్సి ఉంటుంది. జనతాదళ్ (ఎస్) పది నుంచి 15 స్థానాలకు పరిమితం కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే లేనే లేదని చెప్పక తప్పదు. ఈ విషయాన్నికమలనాధులు తమ అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. అప్పట్లో అంటే 2014లో నరేంద్ర మోడీ గాలి దేశవ్యాప్తంగా బలంగా ఉంది. కర్ణాటకలోనూ దాని ప్రభావం కనపడింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేనే లేదు.

మోడీ హవా తగ్గడంతో…..

మోడీ హవా ప్రస్తుతం కనపడటం లేదు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలు ఎంతకాదన్నా కమలనాధుల కాళ్లకు బ్రేకులు వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సాయం, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఎన్నికల్లో ఎక్కడ ప్రభావం చూపుతాయోనని కమలం శ్రేణులు లోలోపల ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో 2014 నాటి లెక్కలు, ఓట్లు, సీట్లను చూసి మురిసి పోవడం కన్నా మూర్ఖత్వం ఉండదని బీజేపీ భావిస్తోంది. అందుకనే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా అందరూ కర్ణాటకపై దృష్టి పెడుతున్నారు. ఇక యడ్యూరప్ప, కేంద్రమంత్రి అనంతకుమార్, సదానంద గౌడ, వంటి వారు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అయితే మఠాలు సందర్శిస్తూ, పీఠాధిపతులకు ప్రణమిల్లుతున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు…. ఇలా ప్రతి చిన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. తాజాగా మైసూరు రాజకుటుంబాన్ని బరిలోకి దింపేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. మైసూరు సహా చుట్టుపక్కల జిల్లాల్లో గత ఎన్నికల్లో పార్టీ పేలవమైన పనితీరును కనబరచింది. ప్రజల్లో ఇప్పటికీ మైసూరు రాజకుటుంబానికి పేరుంది. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు షా పావులు కదుపుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యాంశం ఉంది. 2009 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 19 కాంగ్రెస్ 6, జనతాదళ్ (ఎస్) మూడు స్థానాలు సాధించాయి. 2014 ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి రెండు స్థానాలు తగ్గి 17కు చేరాయి. కాంగ్రెస్ తన బలాన్ని 6 నుంచి 9కి పెంచుకోగలిగింది. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉంటే రాష్ట్రంలో ఆ ప్రభావం పెద్దగా లేదనడానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి అక్కరలేదు.

రెండు పార్టీల్లోనూ గుబులు….

2014 లోక్ సభ ఫలితాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ కు 77 స్థానాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. కానీ పార్టీ పరిస్థితి మరీ అంత దిగదుడుపుగా లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగలదన్న అంచనాలు సర్వే సంస్థలు వెలువరిస్తున్నాయి. అలా అని పార్టీ కూడా అతి ధీమాను ప్రదర్శించడం లేదు. ఎక్కడ పుట్టి మునుగుతుందోనన్న భయం అంతర్గతంగా దానిని వెంటాడుతోంది. అందువల్లే పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు కలసి కట్టుగా పోరాడుతున్నాయి. మొత్తం మీద నాలుగేళ్ల క్రితం నాటి లోక్ సభ ఎన్నికల పరిస్థితులు ఇప్పుడు లేవని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లు గుర్తించడం గమనించ దగ్గ విషయం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*