కమలానికి తిరుగులేదా?

ఈశాన్యంలోనూ కమలం జెండా ఎగరనుందా? ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల్లోనూ కమలనాధులకు తిరుగులేదా? అవును. ఎగ్జిట్ పోల్స్ ఇవే చెబుతున్నాయి. త్రిపురలో ఈ నెల 18 ఎన్నికలు జరగ్గా, నాగాలాండ్, మేఘాలయలో మాత్రం ఈనెల 27వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి మెరుగుపడిందని, కమ్యునిస్టులకు కంచుకోటగా ఉన్న త్రిపురలో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్న ఫలితాలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేశాయి.

త్రిపురలో సయితం….

త్రిపురులో ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరిగాయి. అయితే ఇక్కడ 25 ఏళ్లుగా సీపీఎం పాలన సాగుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ పై ఎలాంటి వ్యతిరేకత లేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మాత్రం త్రిపురలో కమ్యునిస్టులు ఇబ్బందుల్లో ఉన్నారన్నది స్పష్టమైంది. న్యూస్ ఎక్స్, మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ సర్వేలో త్రిపురలో కమలనాధులు అధికారంలోకి వస్తారని తేలింది. ఇక నాగాలాండ్ లో సయితం బీజేపీ కూడా అధికారంలోకి వస్తుందన్న ఫలితాలు ఈ సంస్థ ఇచ్చింది.

గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ….

కాని మరో సంస్థ సీ ఓటర్ సర్వే ప్రకారం త్రిపురలో కమ్యునిస్టులు స్వల్ప సీట్ల తేడాతోనైనా అధికారంలోకి వస్తారని తేల్చింది. త్రిపురలో 60 సీట్లు ఉండగా సీపీఎం మెజారిటీ స్థానాలను గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంటుందని చెప్పింది. న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం త్రిపురలో బీజేపీ, ఇండిజినియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర కూటమికి 51 శాతం ఓట్లు రాబట్టుకుంని 35 నుంచి 45 సీట్లు రావచ్చని పేర్కొంది. కాని సీ ఓటరు సర్వే ప్రకారం త్రిపురలో సీపీఎంకు 26 నుంచి 34 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. బీజేపీకి 24 నుంచి 32 సీట్లు వస్తాయని చెప్పింది.

మేఘాలయ కమలానిదే….

మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని, ఆ పార్టీకి 23 నుంచి 27 సీట్లు వచ్చే అవకాశముందని న్యూస్ ఎక్స్ సర్వే తెలిపింది. అయితే ఇదే రాష్ట్రంలో సీ ఓటర్ సర్వే ప్రకారం నేషనల్ పీపుల్స్ పార్టీకి 17 నుంచి 23 స్థానాలు వస్తాయని చెబుతుంటే, యాక్సిస్ ఇండియా సర్వే మాత్రం ఇక్కడ బీజేపీకి 30 సీట్లు వస్తాయని తెలిపింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడా బలంగా లేదని ఈ సర్వే ద్వారా స్పష్టమయింది. అధికారంలో ఉన్న మేఘాలయలో కూడా కాంగ్రెస్ కు పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 3వ తేదీన వెలువడనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*