కర్నూలులో జగన్ కేక పుట్టిస్తారా?

జగన్ కర్నూలు జిల్లాలో నేడు ప్రవేశించనున్నారు. ఎనిమిదో రోజు ఆయన కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేయనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కర్నూలు జిల్లా వైసీపీకి సవాల్ గా మారింది. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 అసెంబ్లీ సెగ్మంట్లను, కర్నూలు, నంద్యాల పార్లమెంటు స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఈ జిల్లాలో టీడీపీ అప్పట్లో నామమాత్రంగానే నిలిచింది. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరిపోయారు. ఇద్దరు ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవైరెడ్డిలు కూడా పసుపు కండువా కప్పేసుకున్నారు. ప్రజలు పార్టీపై నమ్మకం ఉంచి గెలిపిస్తే వారు ప్రజాభిప్రాయానికి విరుద్థంగా పార్టీ మారిన విషయాన్ని తన పాదయాత్ర జగన్ ఎండగట్టనున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి మారి మంత్రి అయిన భూమా అఖిలప్రియ సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచే ఈపాదయాత్ర కర్నూలు జిల్లాలో ప్రవేశించనుంది.

నేతలు మారినా…. జనం….

కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారినప్పటికీ వైసీపీ అధినేత వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. నియోజకవర్గ ఇన్ ఛార్జులను నియమించారు. మరోవైపు ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి ప్రధాన శత్రువైన గంగుల ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అలాగే శిల్పా మోహన్ రెడ్డిని, శిల్పా చక్రపాణిరెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో జగన్ పాదయాత్ర సక్సెస్ చేసేందుకు వైసీపీ వర్గాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. నేతలు పార్టీ మారినా ప్రజలు తమ వెంటే ఉన్నారన్న సంకేతాలు ఇచ్చేందుకు భారీగా జనసమీకరణకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇప్పటికే కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై పాదయాత్రపై చర్చించారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. తర్వాత ముత్యాలపాడు బస్టాండ్ లో జగన్ ప్రజలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి నెట్టివేడు, గొడగనూరు, ముత్యాలపాడుకు చేరుకుంటుంది. ముత్యాల పాడు నుంచి చక్రవర్తుల పల్లి వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. జగన్ రాత్రి బస చక్రవర్తుల పల్లిలోనే ఉంటుంది. కర్నూలు జిల్లాలో జగన్ కేక పుట్టిస్తారని వైసీపీ వర్గాలు భావిస్తన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1