కాంగ్రెస్ కు కష్టకాలమే…

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు భవిష్యత్ ఉందా? కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు దగ్గరకు రానిస్తారా? రెండున్నరేళ్లు గడిచిపోయినా ఇంకా  ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన బాధ నుంచి ఏపీ ఇంకా తేరుకోలేదు. ప్రజలు నాడు కళ్ల ముందు కన్పించిన దృశ్యాలను మరచిపోలేదు. దీంతో మరో దశాబ్దకాలం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కష్టంగానే ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.

సీన్ రివర్స్….
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం విడిపోనంత వరకూ గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ కు కొన్నేళ్ల పాటూ సంప్రదాయంగా వస్తున్న ఓట్లతో పాటుగా వైఎస్ వల్ల కూడా ఓటు బ్యాంకు ఏపీలోని 13 జిల్లాల్లో బాగా పెరిగింది. నేతలు కూడా కాంగ్రెస్ కు కొదవలేదు. అయితే ఒక్కసారి సీన్ రివర్స్ అయింది. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏకపక్షంగా విడగొట్టిందన్న బాధ ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఒక్క సీటు కూడా దక్కలేదు. హస్తం గుర్తుపై ఓటు వేయాలంటే జనం ఈసడించుకునే పరిస్థితి తలెత్తింది. అంత బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్, ఏ నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అభ్యర్ధి డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. తమ కసిని…కోపాన్ని ప్రజలు కాంగ్రెస్ పై అలా వెళ్లగక్కారు.

పార్టీని వీడుతున్న నేతలు….
ఇక రెండున్నరేళ్లు గడిచిపోయినా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదనే చెప్పాలి. అప్పటి వరకూ మంత్రి పదవులు అనుభవించిన సీనియర్ నేతలెందరో పార్టీని వీడి వెళ్లిపోయారు. ఏపీలో కాంగ్రెస్ చచ్చినట్లేనని వారు వెళుతూ..వెళుతూ కామెంట్ చేశారు కూడా. ఆ పార్టీకి ఏపీలో సరైన నాయకత్వం కూడా లేదు. ఏపీపీసీసీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డిని నియమించినా ఆయన చేయగలిగిందేమీ లేదనే చెప్పాలి. ఆయనకు కిందిస్థాయి నేతల నుంచి అందుతున్న సహకారం కూడా తక్కువే. నిన్న మొన్నటి వరకూ నియోజకవర్గంలో పార్టీ టిక్కెట్ల కోసం పోటాపోటీ పడ్డారు. ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీని లీడ్ చేసే వారే కరువయ్యారు. రఘువీరా ఏదో అడపా…దడపా జిల్లాల్లో పర్యటిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

సోనియా పేరెత్తితేనే….
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా అంటేనే ఏపీ జనం మండిపడుతున్నారు. అందుకే ఇప్పటివరకూ సోనియా సభలను ఏపీలో కాంగ్రెస్ ఏర్పాటు చేయలేకపోయింది. సోనియా బొమ్మ చూపితే కాస్తో….కూస్తో పడే ఓట్లు కూడా పడవన్నది ఆ పార్టీ నేతల్లో ఉన్న నమ్మకం. అందుకే సోనియాను దూరం పెట్టి రాహుల్ వైపు ఏపీ నేతలు మొగ్గు చూపుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదని…ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని నిరసిస్తూ కాంగ్రెస్ ఏపీలో చేపట్టిన సంతకాల ఉద్యమం చప్పగా సాగింది. విద్యార్థులను తీసుకొచ్చి ఏదో మ…మ…అన్పించారు. అంతేతప్ప ఆ పార్టీని జనం పక్కన పెట్టేశారన్నది సంతకాల సేకరణలోనే స్పష్టంగా తెలిసిపోయింది.

కాంగ్రెస్ ఏం చేస్తుంది?
కాంగ్రెస్ ఈ రెండున్నరేళ్లలో ప్రజాసమస్యలు చేపట్టినా పెద్దగా స్పందన రాకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కన్పిస్తుంది. ఎందుకంటే ఏపీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరూ సాహసించరు. చివరకు వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ ను పక్కన పెట్టే అవకాశాలే ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆపార్టీని దరిదాపుల్లోకి కూడా రానీయదు. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఓట్లు కూడా రావన్నది మిగిలిన పార్టీల ఆలోచన. అందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాల్సి ఉంటుంది. మరి అన్ని నియోజకవర్గాలకూ కాంగ్రెస్ కు అభ్యర్ధులు దొరకడమూ కష్టమే. ఎవరూ ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి సాహసించరు. అందుకే కాంగ్రెస్ ఏపీలో కష్టకాలమే. అందుకే కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమైన నేతలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. లేదంటే తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారు.

కొసమెరుపు: ఏపీని కాంగ్రెస్ చేజేతులా మరో తమిళనాడులా చేసుకుంది. తమిళనాడులో లాగా మరో దశాబ్దకాలం ఆ పార్టీకి ఏపీలో పుట్టగతులుండవనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏపీలో ప్రస్తుతం రెండు ప్రాంతీయ పార్టీలదే హవా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*