కాంగ్రెస్ కు కాంగ్రెస్సే శత్రువా…?

తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా ముందు నేతలు కుండబద్దలు కొట్టేశారు. గత మూడు రోజులుగా కుంతియా నేతలతో విడివిడిగా భేటీ అవుతున్నారు. గోల్కొండ హోటల్ లో ప్రత్యేకంగా జరుపుతున్న ఈ భేటీలో కొందరు నేతలు పీసీసీ నాయకత్వంపై తీవ్రంగానే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సర్వేల పేరుతో 70 సీట్లు వస్తాయని ప్రచారం చేసుకోవడమే తప్ప క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు అంత సీన్ లేదని కొందరు నేతలు వివరించినట్లు సమాచారం. సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, సంపత్, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్ తదితరులు కుంతియాతో భేటీ అయి తమ మనసులో మాటను చెప్పారు.

గ్రేటర్ర హైదరాబాద్ లో….

గ్రేటర్ హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీకి బలం ఉన్న స్థానాలను మినహాయిస్తే మొత్తం 20 స్థానాలున్నాయని, వాటికి ఇంతవరకూ ఇన్ ఛార్జులనే నియమించలేదని చెప్పారు. ఇరవై సీట్లలో ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని కొందరు తెగేసి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ లో కీలకంగా ఉన్న సెటిలర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఒక్క ప్రయత్నమూ ఇప్పటి వరకూ చేయలేదన్నారు. పైగా గ్రేటర్ కు అసలు నాయకుడు ఎవరన్నదీ అంతుపట్టని సమస్యగా తయారైందన్నారు. 20 సీట్లున్న ప్రాంతాన్ని విస్మరిస్తూ తమకు 70 సీట్లు వస్తాయని డప్పాలు కొట్టుకోవడమేంటని పరోక్షంగా ఉత్తమ్ పై విమర్శలు సంధించారు.

బాధ్యతల మాటేమిటి?

అలాగే కుంతియాను కలిసిన ప్రతి ఒక్క నేత తమకు పీసీసీలో బాధ్యతలను అప్పగించాలని కోరడం విశేషం. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఒకవైపు అధికార పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రారంభిస్తే…కాంగ్రెస్ మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయడానికి కనీస ప్రయత్నమూ జరగకపోవడాన్ని తప్పుపట్టారు. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇస్తున్న ప్రాధాన్యం తమకు లభించడం లేదని, దీనిని అధిష్టానం దృష్టికి తీసుకెళతామని వీహెచ్ సీరియస్ గానే చెప్పినట్లు తెలిసింది.

అభ్యర్థులను ముందుగా ప్రకటించాలి….

ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని కొందరు డిమాండ్ చేశారు. మార్చి నెలలోపు యాభై శాతం మంది అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని సూచించారు. గోల్కొండ హోటల్ లో కూర్చుని అంతా బాగుందనుకుంటే పొరపాటవుతుందని, జిల్లాలకు వెళ్లి స్థానిక నేతలతో చర్చించి నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించే ప్రయత్నం చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ కే పరిమితం కాకుండా బస్సుయాత్ర, పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. మూడు రోజులుగా కుంతియా పలువురు నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు.నేతల అభిప్రాయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానని కుంతియా చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*