కాజల్ కన్నీళ్ళు పెట్టిస్తున్నారా …?

కాజల్ అగర్వాల్…. దశాబ్దం దాటినా డిమాండ్ కంటిన్యూ చేసుకోగలిగిన నటి. స్ఫూరద్రూపమైన రూపం. చక్కటి అభినయం. హిట్స్ అందించే హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతులు ఇన్ని ఉన్నప్పుడు కాజల్ ఎలా తగ్గుతుంది. అందుకే ఇప్పుడు నిర్మాతలకు కంటతడిపెట్టే రేటు పెట్టి అందరిని వణికిస్తోంది అని ఇండస్ట్రీ టాక్. ఇటీవల కాజల్ నటించే చిత్రాలు బాగా తక్కువ అయిపోయాయి. కారణం ఏమిటి ? ఆమెకు డిమాండ్ పడిపోయిందా అంటే అదీ లేదు. కొన్ని ఆఫర్లు కాజల్ వద్దనుకుంటే కొన్ని నిర్మాతలే వదిలేసుకుంటున్నారుట. అది సంగతి.

కోటిన్నర డిమాండ్ చేస్తున్న కాజల్..?

బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా ఒకటే. డిమాండ్ వున్నప్పుడే సొమ్ము చేసుకోవాలి. ముఖ్యంగా హీరోయిన్స్ మరీ ముఖ్యంగా. ఎందుకంటే వారు దశాబ్దాల తరబడి శ్రీదేవి లా రాణించలేరు. తళుక్కుమన్నప్పుడే నాలుగు రాళ్ళు తొందరగా వెనకేసుకోవాలి. సరిగ్గా ఈ ఫార్ములా ఫాలో అయిపోతుంది కాజోల్. ఇప్పుడు ఆమె రెమ్యునరేషన్ కోటిన్నర అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంత సొమ్ము ఒక హీరోయిన్ పై పెడితే మిగిలిన ఖర్చులు తడిసి మోపెడు అవుతాయని నిర్మాతలు జంకుతున్నారుట. దాంతో ఆమెకి ఆఫర్లు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తుంది.

కాజల్ కి షాక్ ఇచ్చిన పందెం కోడి …

తమిళ హీరో విశాల్ తెలుగు లో వచ్చిన టెంపర్ చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ తీస్తున్నారు. తెలుగు లో కాజల్ పాత్రకు తమిళ్ లో ఆమెనే ఎంపిక చేశారు విశాల్. కొంత అడ్వాన్స్ కూడా ఎందుకైనా మంచిందని ముందే ఇచ్చేశారుట. తీరా కాజల్ తన రేటు చెప్పేటప్పటికీ గతుక్కుమన్న విశాల్ మరో హీరోయిన్ ను రేష్మీకి ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. ఆమె 50 లక్షల రూపాయలకే సినిమాలో నటించడానికి అంగీకరించడంతో విశాల్ ఆమెతో డీల్ ఒకే అయ్యాక కాజల్ కి నో చెప్పి ఆమెకి షాక్ ఇచ్చారు. ఇలా ఒక్క విశాల్ మాత్రమే కాదు చాలా మందికి కాజల్ ధర దడలాడిస్తుంది. కథ పాత్ర సంగతి పక్కన పెట్టి ముందు నా రెమ్యునరేషన్ తేల్చమని ఖరాఖండిగా ఆమె చెప్పడంతో ఖంగుతింటున్న నిర్మాతలు కొత్తవారికి అవకాశాలు పిలిచి మరీ ఇచ్చేస్తున్నారు. అయినా కాజల్ మాత్రం ఎక్కడా తగ్గేదే లేదని భీష్మించుకోవడం చర్చనీయాంశం అయ్యింది.