కారు అదే స్పీడు కొనసాగిస్తుందా?

నల్గొండ జిల్లాలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను మినహాయిస్తే భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. అయితే, ఇదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం కేవలం 30 వేల ఓట్ల తేడా తోనే టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ ఎన్నికల్లో ఈ ఐదు నియోజకవర్గాల్లో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం.

ఎమ్మల్యేపై వ్యతిరేకతే……

నకిరేకల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ కు చెందిన వేముల వీరేశం బరిలో ఉండనున్నారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై 2370 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ప్రజలకు అందుబాటులో ఉండటం, అభివృద్ధి విషయంలో వీరేశంపై ఎటువంటి ఫిర్యాదులు లేకపోయినా, వివాదాస్పద ఎమ్మెల్యేగా ఆయన ఈ నాలుగేళ్లుగా నిలిచారు. అధికారులను, ప్రేవేటు వ్యక్తులను దూషించడం, వార్నింగ్ లు ఇవ్వడం, ఈ ఆడియోలు బయటకురావడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఇక ఇటీవల నల్గొండలో హత్యకు గురైన మున్సిపల్ ఛైపర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులోనూ ఆయనపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవే ఆయనకు రానున్న ఎన్నికల్లో ప్రతిబంధకాలుగా మారనున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి సోదరుల అనుచరుడు చిరుమర్తి లింగయ్యనే మళ్లీ బరిలో ఉండనున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ బలం, ఎమ్మెల్యేపై వ్యతిరేకతనే ఎక్కువగా కలిసివచ్చే అవకాశం ఉంది. ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా ప్రస్థుతానికైతే ద్విముఖ పోరే కనపడుతోంది.

భువనగిరిలో త్రిముఖ పోరు…..

భువనగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పైళ్ల శేఖర్ రెడ్డి చివరి నిమిషంలో వచ్చి పార్టీ ఇమేజ్ తో విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి జిట్టా బాలకృష్ణా రెడ్డి 40 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. అయితే, గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యేగా శేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజల్లో బాగా పట్టు సంపాదించారు. అయితే, టీఆర్ఎస్ మాజీ నేత జిట్టా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. ఆయనపై నియోజకవర్గంలో సానుభూతితో పాటు బలమైన అనుచరవర్గం ఉంది. ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచిం కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఇంఛార్జిగా ఉన్నారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ, ఇక్కడ మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం ఆయనకు సహకరించడం లేదు. దీంతో వర్గపోరు ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఒకవేళ జిట్టా మళ్లీ స్వతంత్రుడిగా బరిలో ఉంటే త్రిముఖ పోటీ ఖాయంగా కనపడుతోంది.

ఆలేరులో ఈసారి ఎవరిది..?

ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమె మొదటిసారి ఎమ్మెల్యే. కానీ, నియోజకవర్గంలో ఆమె అంతగా పట్టు సంపాదించలేక పోయారు. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ లోకి చేరే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కూడా ఈసారి ఆలేరు నుంచి బరిలో ఉంటారనే ప్రచారమూ ఉంది. కాంగ్రెస్ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షడు బూడిద బిక్షమయ్య గౌడ్ బరిలో ఉండనున్నారు. బీసీ సామాజికవర్గంలో పట్టు ఉండటంతో పాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆయనకు కలిసి రానుంది. కానీ, భూకుంభకోణం ఆరోపణలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గంతో పొసగకపోవడం మైనస్ గా మారింది. ఇక తెలంగాణ పరిరక్షణ సమితి పేరుతో కల్లూరి రామచంద్రారెడ్డి కూడా నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ టిక్కెట్ పై ఆశపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కోమటిరెడ్డి అండ ఉందని వినపడుతోంది.

యువ నేతల పోరులో గెలుపెవరిదో..?

ఎస్సీ రిజర్వు స్థానమైన తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీకి మంచి బలం ఉంది. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి పలు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎస్సీగా రిజర్వు కావడంతో సూర్యాపేటకు వెళ్లారు. గత ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల నుంచీ యువకులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారే పోటీ పడ్డారు. టీఆర్ఎస్ తరుపున ఓయూ విద్యార్థి నాయకుడు గాదరి కిషోర్ కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పై రెండు వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ వీరి మద్యే ప్రధాన పోటీ ఉండనుంది. యువ ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందినా, నియోజకవర్గంలో నేతలను అంతగా కలుపుకపోవడం లేదనే వాదన ఉంది. అద్దంకి దయాకర్ కు పార్టీ ఇమేజ్ ప్రధాన బలంగా మారనుంది.

కాంగ్రెస్ వర్గపోరే టీఆర్ఎస్ కు…..

గత ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై సుమారు 40 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పొత్తు కారణంగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని సీపీఐకి వదిలేసింది. అయితే, పార్టీ ఇమేజ్, బలమైన ప్రత్యర్థి లేకపోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి గత ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. కానీ, ఆయన నాలుగేళ్లుగా అంత బలంగా ఏమీ మారలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వివిధ కార్యక్రమాలతో దూకుడుగా వెళుతున్నారు. ఇదే సమయంలో దివంగత కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి కూడా టిక్కెట్ తనకే అని ధీమాగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ లోని వర్గపోరు మరోసారి టీఆర్ఎస్ కి కలిసివచ్చే అవకాశం కనపడుతోంది. అయితే, రాజగోపాల్ రెడ్డి బరిలో ఉంటే టఫ్ ఫైట్ ఉండనుందని వినపడుతోంది.