కింగ్ అయ్యేటట్లున్నారే….!

జేడీఎస్ కు వచ్చిన సీట్లు 38 మాత్రమే. కింగ్ మేకర్ అవుతారనుకున్న కుమారస్వామి కింగ్ కానున్నారా? 78 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ జనతాదళ్ ఎస్ కు మద్దతిచ్చి ప్రభుత్వ ఏర్పాటుచేయమని కోరడంతో కుమారస్వామి రొట్టె విరిగి నేతిలో పడింది. కుమారస్వామికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఎగిరి గంతేసి గవర్నర్ వద్దకు బయలుదేరారు. మరి కర్ణాటకలో ఏదైనా జరగొచ్చు. కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేక బీజేపీయే మరికొందరి మద్దతుతో సర్కార్ ను ఏర్పాటు చేస్తుందా? అన్నది కొద్దిరోజుల్లో తెలియనుంది. అయితే కన్నడనాట జనతాదళ్ ప్రస్థానంపై ‘‘తెలుగు పోస్ట్’’ ప్రత్యేక కథనం.

తండ్రీకొడుకులు కలిసి……

హర్దనహళ్ళి దొడ్డగౌడ దేవెగౌడ రధ్యంలోని జనతాదళ్(సెక్యులర్) ప్రభావం ఆది నుంచి పరిమితమే. పూర్తిస్థాయిలో రాష్ట్రస్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి దానికి లేదు. మొదట్లో కొంతకాలం దేవెగౌడ, అనంతర కాలంలో బీజేపీతో కలిసి సంకీర్ణ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రులుగా పని చేసినప్పటికీ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేయడంలో విజయవంతం కాలేకపోయారు. అందువల్లె దానిబలం 30 నుంచి 60 స్థానాలకు పరిమితమవుతూ వస్తొంది. గత ఎన్నికల్లో బీజేపీకి దీటుగా 40 స్థానాలను సాధించింది. ఈసారి కూడా 38 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ ఎన్నికల ఫలితాలపై దేవెగౌడ పార్టీ భారీ ఆశలనే పెట్టుకుంది. తమ పార్టీ ఎటూ గెలవబోదన్న సంగతి తండ్రికొడుకులు ఇద్దరికీ బాగా తెలుసు. అయినప్పటికీ హంగ్ అసెంబ్లీ ర్పడితే తాము ‘కింగ్ మేకర్’ అవుతామని వారు కలలు కన్నారు. రాజకీయ బేరసారాలతో ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి పదవి పొందవచ్చని ఆశతో ఉంది. అంతేకాకుండా మంత్రి పదవులను కైవసం చేసుకోవచ్చన్నది దాని అంచనా. ఆ ఆశ నెరవేరేటట్లే ఉంది.

సిద్ధాంతాలేవీ లేవు….

పార్టీపరంగా దానికి పెద్దగా సిద్ధాంతాల బాదరాబందీ ఏమీలేదు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తో పొత్తుకు అది సిద్ధమే. గతంలో బీజేపీతో కలిసి ప్రయాణించిన అనుభవం ఉంది. పైకి బీజేపీతో కలవబోమని దేవెగౌడ బీరాలు పలుకినప్పటికీ అవసరం వస్తే ఏ పార్టీతో అయినా కలవడం అనివార్యం. గతంలో ఒకసారి పొత్తు పెట్టుకుని పెద్ద తప్పుచేశామని, బీజేపీతో తమ కుమారుడు కుమారస్వామి పొత్తుపెట్టుకుంటే పూర్తిగా కుటుంబం నుంచే బహిష్కరిస్తామని సైతం దేవెగౌడ హెచ్చరిస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ మద్దతిచ్చింది. అధికారం ముందు అన్నీ సర్దుబాటు అవుతాయి. బీజేపీని పక్కన పెడితే కాంగ్రెస్ తో కలవడానికి దానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఇంతకాలం ఉన్న సిద్ధరామయ్య పూర్వాశ్రమంలో జనతాదళ్(ఎస్) నాయకుడే. రాజకీయ ప్రస్థానం అక్కడే ప్రారంభించారు. రెండుసార్లు ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు కూడా.

మొదటి నుంచి అంతే….

జనతాదళ్(ఎస్) ప్రభావం రాష్ట్రంలో మొదటి నుంచీ పరిమితమే. రాష్ట్రవ్యాప్తంగా దానికి పట్టులేదు. కేవలం కొన్ని ప్రాంతాలకు, జిల్లాలకు పరిమితమైన పార్టీగా పేరుంది. అంతేకాక కుటుంబపార్టీగా, కుల పార్టీగా దానిపై గట్టి ముద్ర ఉంది. గౌడ కటుంబీకులకు మాత్రమే పార్టీలో అగ్రతాంబూలం దక్కుతుంది. వారి తరవాతే మిగతా వారు ఎవరైనా. దేవెగౌడ, ఆయన ఇద్దరు కుమారులు కుమారస్వామి, హెచ్.డీ.రేవణ్ణ, కోడలు అనితాకుమారస్వామి, మనవడు ప్రజ్వల్ వంటివారు పార్టీపై పెత్తనం చేస్తుంటారు. తాజా ఎన్నికల్లో కుమారస్వామి బెంగళూరు శివార్లలోని చెన్నపట్న, రామనగర నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కుటుంబపార్టీగా ముద్ర నడినందునే దాని ప్రభావం కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది.

కొన్ని ప్రాంతాలకే పరిమితం…..

ముఖ్యంగా మైసూరు ప్రాంతంలో, దక్షిణ కర్ణాటకలో మాత్రమే పార్టీ బలంగా ఉంది. దక్షిణ కర్ణాటకలోని చామరాజ్ నగర్, హసన్, మాండ్యా, మైసూర్, కోలార్, చిక్కుబళ్ళాపూర్ తదితర జిల్లాలోల మాత్రమే పార్టీ బలంగా ఉంది. ఈ జిల్లాల్లో 57 నియోజకవర్గాలున్నాయి. ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో గెలిచింది కూడా ఈ జిల్లాల్లోనే. ఇవన్నీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లాలు. ఈ జిల్లాల్లో ఒక్కలిగ సామాజిక వర్గీయులు అధికం. దేవెగౌడ కూడా ఈ సామాజికవర్గం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఈ వర్గం ఓట్లతోనే జనతాదళ్(ఎస్) మనుగడ సాధిస్తోంది. ఒక్కలిగలతో పాటు దళిత, కురబ సామాజికవర్గీయులు ఎక్కువ. ఒక్కలిగలు ఎక్కువ జనతాదళ్ కు, దళిత, కురుబలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని మొత్తం 57 స్థానాల్లో కాంగ్రెస్ 27, జనతాదళ్(ఎస్) 25, బీజేపీ 3 స్థానాలను గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో జనతాదళ్(ఎస్)కు మొత్తం 40 స్థానాల్లో ఒక్కడ మైసూరు ప్రాంతంలోనే 25 వచ్చాయి. అంటే రాఫ్ట్రవ్యాప్తంగా వచ్చింది కేవలం 15 కావడం గమనార్హం.వాస్తవానికి 1995 ప్రాంతంలో దళ్ కు రాష్ట్రవ్యాప్తంగా మంచి పట్టుంది. అప్పట్లో ఉత్పన్నమైన ఈద్గా మైదాన్ ఘటనలో పార్టీ ముస్లింల వైపు మెుగ్గు చూపింది. దీంతో ఇతర వర్గాల ప్రజలు పార్టీకి దూరమయ్యాయి. క్రమంగా అది ఒక ఉప ప్రాంత పార్టీగా మిగిలిపోయింది. ఈ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో నిలిచింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*