కుట్రలన్నీ జగన్ ఖాతాకే….!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా అందుకు బీజేపీయేనే తొలుత వేలెత్తి చూపుతున్నారు. నిన్న మొన్నటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడ్డుపడుతుందంటూ చెబుతూ వచ్చిన చంద్రబాబు గత నెల నుంచి ఏ సమస్య వచ్చినా దాన్ని బీజేపీపై నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సమస్యను కూడా కమలం పార్టీకి చుట్టేశారు చంద్రబాబు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ చిక్కు వచ్చినా అది ఢిల్లీ నుంచే వచ్చిందని కమలనాధులపైకి నెట్టేస్తున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా పరవాలేదంటున్నారు తెలుగుతమ్ముళ్లు. వాటిని జగన్, మోడీ ఖాతాల్లోకి వేసేయవచ్చని భావిస్తున్నారు.

ధర్మపోరాట సభల పేరిట…..

కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందంటూ చంద్రబాబు ధర్మ పోరాట సభలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ తిరుపతిలో తొలుత సభను పెట్టిన చంద్రబాబు లేటెస్ట్ గా విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ సభ మొత్తం తన ప్రభుత్వ ప్రచారానికే ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఏపీకి కేంద్రం చేసిన మోసం కంటే తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎక్కువగా ఈ సభల్లో చెప్పుకుంటూ పోతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లోనూ తననే ఆశీర్వదించాలని, అప్పడే నవ్యాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ఈ సభల ద్వారా శ్రీకారం చుట్టారు.

రమణ దీక్షితుల వ్యవహారం కూడా…..

ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో వివాదం గత కొద్ది రోజులుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కొన్ని వివాదాలను లేవనెత్తారు. శ్రీవారి విలువైన గులాబీ వజ్రం మాయమైందని, ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు జరగడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఈ అంశాన్ని కూడా బీజేపీకి, వైసీపీికి చుట్టేశారు. రమణ దీక్షితులు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలసి వచ్చిన తర్వాతనే ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారని చంద్రబాబు ఆరోపించడం విశేషం. తిరుమలపై కేంద్రం కుట్ర పన్నిందంటూ ప్రజల్లో సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.

వై.ఎస్. ఫొటో ఉండకూడదా?

అలాగే వైసీపీని కూడా ఈ వివాదంలో భాగస్వామిని చేసేశారు. రమణ దీక్షితులు తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫొటో పక్కనే వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టుకుని ఉన్నారని, దీన్ని బట్టి ఆయన ఎలాంటి స్వామో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అనడం విశేషం. ఏడుకొండల వాడితో పెట్టుకుంటే వడ్డీతో సహా వసూలు చేస్తారని వైసీపీ, బీజేపీలను హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే ప్రయత్నం చేస్తే బీజేపీ, వైసీపీ నేతలను వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. మొత్తం మీద రాష్ట్రంలో ఏ ప్రతికూల పరిస్థితి తలెత్తినా దాన్ని బీజేపీ, వైసీపీ ఖాతాల్లో వేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికే చంద్రబాబు ఇలా ప్రతిదానికీ వైరి పక్షాలకు బురద అంటించే కార్యక్రమం చేస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*