కేంద్రంతో కయ్యానికి బాబు సిద్ధమయ్యారా?

తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం ముగిసింది. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్, రెవెన్యూ లోటు, అసెంబ్లీ సీట్లు పెంపు తదితర అంశాలపై చంద్రబాబు ఎంపీలతో ముఖాముఖి చర్చించారు. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ పై ఈ పార్లమెంటు సమావేశాల్లనే కేంద్రంపై వత్తిడి తేవాలని నిర్ణయించారు.విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్రుల కల. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ప్రకటించలేదు. దీనిపై కేంద్రంచేత స్పష్టమైన ప్రకటన చేయించేలా వత్తిడి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు సూచించారు. రైల్వే జోన్ ను తేకుంటే ఆ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందన్న చంద్రబాబు జోన్ ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సమస్యలేమిటో కనుక్కోవాలని కూడా ఎంపీలను కోరారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై స్పష్టత రావాలని చంద్రబాబు కోరారు. లేకుంటే ఎన్నికలకు ముందు ఇచ్చామన్న అపవాదును ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఇద్దరి ఎంపీలకు ప్రత్యేక బాధ్యతలను సీఎం ఇచ్చారని సమాచారం. అవసరమైతే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఇబ్బందిపడినా గట్టిగా పోరాడాలని బాబు ఎంపీలకు ఉద్భోదించారు.

నియోజకవర్గాల సంఖ్య పెంపు కూడా……

అలాగే నియోజకవర్గాల పెంపుపై కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే స్పష్టత రావాల్సి ఉందన్నారు. నియోజకవర్గాల పెంపు అవసరమని, లేకుంటే కష్టమని కేంద్రప్రభుత్వానికి గట్టిగా చెప్పాలని కోరారు. ప్రస్తుతమున్న 175 స్థానాల నుంచి 225 స్థానాలకు పెంచాలని విభజన చట్టంలోనే ఉన్నందున దానిని సత్వరమే అమలు చేయాలని కోరాలన్నారు. తాను కూడా ఇక్కడి నుంచి నియోజకవర్గాల పెంపుపై బీజేపీ పెద్దలతో మాట్లాడతానని, అక్కడ కూడా దానికి సంబంధించిన అధికారులు, మంత్రులతో చర్చించాలని చంద్రబాబు తెలిపారు. అలాగే 9,10 షెడ్యూల్ అంశాల్లోని ఆస్తుల విషయంలోనూ స్పష్టత త్వరగా రావాల్సి ఉందన్నారు. రాష్ట్రం తీవ్రంగా రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నదని, అందుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సత్వరమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలకు హితబోధ చేశారు. రాష్ట్ర రెవెన్యూ లోటును కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన సమావేశంలో ఆవేదన చెందినట్లు తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*