కేంద్రమంత్రి అశోక్ ను చంద్రబాబు నమ్మడం లేదా?

కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును తెలుగుదేశం పార్టీ అధిష్టానం పక్కన పెడుతున్నట్లే కన్పిస్తోంది. ఆయన మాటకు పార్టీలో చెల్లుబాటు కావడం లేదని మరోసారి స్పష్టమైంది. విజయనగరం జిల్లాను పార్టీ పరంగా ఇప్పటి వరకూ శాసించిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. ఆయన మాటను కాదని వేరే వారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. దీంతో అశోక్ గజపతిరాజు వర్గంలో కలకలం రేపింది. జిల్లా అధ్యక్షుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. అందులో రాజుగారు సూచించిన పేరును చంద్రబాబు స్కిప్ చేసేశారు. ఆయన జిల్లా ఇన్ ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు సూచనల మేరకు మహంతి చిన్ననాయుడు పేరును ప్రకటించడంతో రాజుగారి వర్గం విస్మయం వ్యక్తం చేసింది.

వేరే వారికి జిల్లా అధ్యక్ష పదవి…….

గత కొద్ది రోజులుగా విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు మాటకు విలువ లేదనే అనిపిస్తోంది. ఇటీవల జరిగిన మినీ మహానాడులోనూ ఆయన తన అనుచరుడు ద్వారంపూడి జగదీష్ పేరును ప్రకటించారు. అయితే ఇన్ ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే ప్రకటిస్తామని చెప్పడంతో రాజుగారికి విషయం అప్పుడే బయటపడి అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. విజయనగరం జిల్లాకు సంబంధించి అశోక్ గజపతిరాజు చెప్పినట్లే పార్టీలో నిన్నమొన్నటి వరకూ నడుస్తుండేది. పార్టీలో ఆయన చంద్రబాబు తర్వాత నెంబర్ 2గా చూసేవారు. అలాంటిది శత్రుచర్ల విజయరామరాజును పార్టీలో చేర్చుకునే విష‍యం కూడా అశోక్ కు చెప్పకుండానే చేశారు. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్న సుజయ కృష్ణ రంగారావును కూడా అశోక్ వ్యతిరేకించారు. కాని చంద్రబాబు రంగారావును పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవి మరీ ఇచ్చారు. దీంతో అశోక్ కు…అధిష్టానానానికి మధ్య గ్యాప్ పెరుగుతుందని అందరూ భావించారు. అందరూ అనుకున్నట్లుగానే తాజాగా జిల్లా అధ్యక్ష పదవి కూడా మహంతి చిన్ననాయుడుకు ఇవ్వడంతో అశోక్ ను పార్టీ దూరంగా పెడుతున్నారనే అనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1