కేసీఆర్ కారుకు ట్రాక్టర్ తోడైతే….?

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాట పట్టారు. రైతు సంక్షేమం కోసం ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉండటంతో ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఆయన రైతు సంక్షేమంపైనే దృష్టిపెట్టారు. రైతులకు రెండు పంటలకు నాలుగు వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నగదును వేసేలా ఒక పథకాన్ని రూపొందించారు. దీన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలంటే రైతు లను మచ్చిక చేసుకునే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను ప్రతి రైతుకు తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామ స్థాయిలో రైతు సంఘాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని బలోపేతం ఎలా చేయోలో వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఇప్పటికే రైతలకు ఎరువులు ఉచితంగా సరఫరా చేయనున్న తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు ఎనిమిది వేలివ్వడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

విపక్షాలను దెబ్బతీసేందుకే…..

రైతులకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం తమదేనని చెప్పుకోవడానికి వరంగల్ సభను వేదికగా చేసుకోనున్నారు. ఈ నెల 27వ తేదీ వరంగల్ లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి పదిహేను లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ బహిరంగ సభకు రైతులను పెద్దయెత్తున తరలించాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. వరంగల్ సభను రైతు సభగా మార్చాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలను ఆదేశించారు. రైతులను విన్నూత్న రీతిలో వరంగల్ కు తీసుకురావడానికి ట్రాక్టర్లను, ఎడ్లబండ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి ట్రాక్టర్లలో రైతులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వరంగల్ కు దగ్గరగా ఉన్న గ్రామాల నుంచి రైతులను ఎడ్లబండ్లలో రప్పిస్తున్నారు. ట్రాక్టర్ల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ అంటే రైతు సింబల్ గా భావిస్తారు. కారు స్పీడ్ కు ట్రాక్టర్ తోడైతే తమకు ఇక తిరుగుండదని గులాబీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద విపక్షాలను దెబ్బతీసేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రణాళికలను రచిస్తున్నారు. మరి అది ఏరకమైన ఫలితాలనందిస్తాయో వేచి చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*