కేసీఆర్ కు బీజేపీ దాసోహం అనక తప్పదా?

బీజేపీ నేతల పరిస్థితి ఏంటో అర్థం కాదు. నిన్నమొన్నటివరకూ అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకున్న బీజేపీ నేతలు ఇప్పడు మౌనం వహిస్తున్నారు. మియాపూర్ భూకుంభకోణం, మైనారిటీ రిజర్వేషన్లు, నయీం వ్యవహారం వంటి విషయాలపై అధికార టీఆర్ఎస్ పార్టీని తూర్పారపట్టిన బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ ఆదేశాలు ఇరుకునపెట్టాయి. గత నెల రోజుల నుంచి బీజేపీ నేతలు అధికార పార్టీపై పల్లెత్తు మాట అనడం లేదు. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ఆ పార్టీ నేతలు సన్మానం చేయించుకుంటుడటం విశేషం. ఇదంతా రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే జరిగిందంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే మద్దతు పలికారు. ఆయన మద్దతు పలికిన వెంటనే బీజేపీ ఢిల్లీ కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. అధికారపార్టీపై విమర్శలు చేయవద్దని దాని సారాంశం. దీంతో బీజేపీ నేతల నోళ్లు మూతపడ్డాయి. ఈరోజుతో రాష్ట్రపతి ఎన్నికలు పూర్తవుతాయి. మళ్లీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకూ బీజేపీ నేతలు అధికార పార్టీపై విమర్శలు చేసే అవకాశం లేదు. డ్రగ్స్ ర్యాకెట్ బయటపడినా బీజేపీ నేతలు స్పందించలేదు.

సెప్టంబర్ 17 తర్వాత చూడమంటున్న నేతలు….

ఇంటింటికీ బీజేపీ జెండా పేరుతో ప్రస్తుతం బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేంద్రప్రభుత్వ పథకాలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా కరపత్రాల రూపంలో ఇంటింటికీ పంచాల్సి ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా నిలిపేసినట్లు సమాచారం. కేవలం కొన్నిచోట్ల కేంద్రప్రభుత్వ విజయాలనే వివరిస్తున్నారు. దీంతో కిందిస్థాయి క్యాడర్ లో అనుమానాలు కలుగుతున్నాయి. అయోమయంలో పడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ అగ్రనేతలు ఆర్భాటంగా ప్రకటించారు. కాని ఇప్పుడు సీన్ అలా లేదు. అధికార పార్టీ, బీజేపీ కలిసిపోయి ఉన్నట్లు కన్పిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, అధికార పార్టీకి అసలైన ప్రత్యర్థులం తామేనంటున్నారు బీజేపీ నేతలు. సెప్టంబర్ నాటికి ఉప రాష్ట్రపతి ఎన్నికలు కూడా పూర్తవుతాయి. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు సెప్టంబర్ 17వ తేదీని భారీగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో భారీగా నిర్వహించి తిరిగి క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపాలని భావిస్తున్నారు. సెప్టంబర్ 18,19 తేదీల్లో వరంగల్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను కూడా నిర్వహించడానికి సిద్దమవుతున్నారు. మొత్తం మీద జాతీయ పార్టీ అవసరాల కోసం రాష్ట్ర స్థాయిలో బీజేపీ అగ్రనేతలు అనుసరించిన వ్యూహం కిందిస్థాయి క్యాడర్ లో అయోమయం నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1