కేసీఆర్ కొత్త డెసిష‌న్‌…..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తెలంగాణలో అధికారం చేప‌ట్టి తీరాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. దీనికిగాను ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా గ్రౌండ్ వ‌ర్క్ కూడా చేస్తున్నారు. విప‌క్షాల‌ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డంతోపాటు.. త‌న పార్టీ బ‌లాన్ని పెంచుకునే క్ర‌మంలోనే ఆయ‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌దీశారు. ఈ క్ర‌మంలోనే అనేక మందిని కారెక్కించుకున్నారు. ఇక‌, ఇంత‌టితో ఆగ‌కుండా ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక‌టి అన్న‌ట్టుగా అన్ని వ‌ర్గాల వారికీ గొర్రెల పంపిణీ, మేక‌ల పంపిణీ, రైతుల‌కు ఉచిత 24 గంట‌ల విద్యుత్‌, ప్రాజెక్టుల నిర్మాణం వంటివి చేప‌ట్టారు. అంతా బాగానే ఉంది. బంగారు తెలంగాణ‌ను సాకారం చేసుకునే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. అయితే, ఎంత అభివృద్ది చేసినా.. ప్ర‌చారం లేక‌పోతే. క‌ష్ట‌మ‌ని భావించిన కేసీఆర్‌.,. తాను చేసిన అభివృద్ధిపై రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఐదు కోట్లతో ప్రత్యేక బస్సు….

కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుపై ఎంతో ధీమాతో ఉంటున్నా ఆయ‌న‌కు మ‌న‌స్సులో ఎక్క‌డో డౌట్ కొడుతోంది. విపక్షాల‌న్ని ఏకం అవుతుండ‌డం, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం పార్టీ ఏర్పాటు, 28 పార్టీల‌తో బ‌హుజ‌న ఫ్రంట్ ఏర్ప‌డుతుంద‌న్న వార్త‌లు ఆయ‌న‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల చివ‌రి ఏడాదిలో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువు కావాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయన బ‌స్సు యాత్ర‌కు రెడీ అవుతున్నారు. దీనికిగాను ఆయ‌న దాదాపు 5 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ఓ ప్ర‌త్యేక బ‌స్సును కొనుగోలు చేశారు. అనంత‌రం, త‌న‌కు అనుకూలంగా ఉండేలా మార్పులు, చేర్పులు చేయించారు. ఇక‌, ఈ బ‌స్సు యాత్రను కేసీఆర్ స్టార్ట్ చేయబోతున్నారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే…

వాస్త‌వానికి గ‌త ఏడాదిలోనే ఈ యాత్ర సాగాల్సి ఉన్నా.. విద్యుత్ విష‌యంలో ఏదీ తేల్చుకోలేని ప‌రిస్థితి నెల‌కొన‌డంతో.. ఆయ‌న త‌న యాత్ర‌ను వాయిదా వేస్తూ వ‌చ్చారు. గత మార్చిలో అసెంబ్లీ సమావేశాలు ముగియగానే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తానని – ఒక్కో జిల్లాలో రెండు మూడు రోజులు మకాం వేసి అక్కడే ఆ జిల్లా అభివృద్ధిపై అధికారులు – ప్రజాప్రతినిధులతో సమీక్షంచడమే కాకుండా ఆ జిల్లాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తానని సీఎం కేసీఆరే స్వయంగా చెప్పారు. అయితే ఆ కార్యక్రమం తాజాగా మొదలైంది.

ప్రస్తుతం కేసీఆర్ హవా….

రాష్ట్రంలో ఇప్పుడు ఎటు చూసినా.. కేసీఆర్, టీఆర్ ఎస్ హ‌వా సాగుతోంది. ఏ న‌లుగురిని క‌దిపినా.. కేసీఆర్ మంచిగా చేస్తున్నాడు! అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్య‌లో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌పెట్టుకునేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారు. దీని ప్ర‌కారం ఆయ‌న బ‌స్సు యాత్ర‌కు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో చాలా వరకు మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమించారు. గత ఏడాది రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి. వర్షాలతో మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువులన్నీ నిండాయి. దీంతో ప్రజలందరూ ముఖ్యంగా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా 24 గంటల కరెంటు ఇవ్వడంతో రైతన్నల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనపై మరలా దృష్టిని పెట్టారని తెలుస్తోంది.

విపక్షాలకు ఇబ్బందేనా?

ఇప్పుడిప్పుడే కాస్త ప‌ట్టు దొరుకుతోంద‌ని ఉత్సాహంతో ఉన్న విప‌క్షాల‌కు కేసీఆర్ తాజా నిర్ణ‌యం వారి గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంది. కేసీఆర్‌ది ఎన్నిక‌ల అజెండాతో సాగుతున్న ప‌ర్య‌ట‌న‌ల‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెంచారు. అయిన‌ప్ప‌టికీ త‌మ‌కు ఎలాంటి ఢోకా లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌కుండా చేయాల‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. మ‌రి ఇన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న ఎలా సాగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1