కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టుకు అధికారుల అడ్డుపుల్ల

ముఖ్యమంత్రి తలచుకుంటే ఇళ్ల నిర్మాణానికి కొరవేముంది? ఎర్రవెల్లిలో కేవలం ఒకటన్నర ఏడాదిలో 500 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో మిగిలిన చోట్ల వీటి పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇళ్లు మంజూరై ఏళ్లు గడుస్తున్నా నిర్మాణపనులు పూర్తి కావడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన డబుల్ బెడ్ రూం పథకానికి అనేక చోట్ల అధికారులు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత వరంగల్ జిల్లాలోనే ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లకు శ్రీకారం చుట్టారు. పథకం మంజూరైందని తెలియగానే లబ్దిదారులు ఉన్న ఇళ్లనూ కూల్చివేసుకున్నారు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తుందన్న ఆశతో వేరే చోట అద్దెకుంటున్నారు. కాని రెండేళ్ల అవుతున్నా ఈ పథకం జాడ తెలియడం లేదు. కూలిన ఇళ్లను చూసుకుని లబ్దిదారులు లబోదిబో మంటున్నారు. వరగంలోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో మిగిలిన చోట ఇంక ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన చోటే దిక్కులేదంటున్నారు విపక్ష పార్టీల నేతలు. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి నిధులు కూడా కేటాయించారు. దాదాపు 800 ఇళ్లకు 60 కోట్ల ను కేటాయించారు. అయినా పనులు మాత్రం జరగడం లేదు. రేపు, మాపు అంటున్నారు అధికారులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేవలం ప్రకటనలకే పరమితం కాకుండా ఆచరణలో డబుల్ బెడ్ రూం నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.