కేసీఆర్ దూకుడుకు బ్రేక్.. రీజ‌న్ ఇదే!

త‌న‌కు ఎదురు లేద‌ని, త‌న‌ను ఎదిరించేవాడు లేర‌ని కామెంట్లు చేసే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తీవ్రమైన ఎదురు దెబ్బ త‌గిలింది. కేసీఆర్ దూకుడుకు బ్రేక్ ప‌డేలా చేసిన ఈ ప‌రిణామం ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ప్ర‌భుత్వం చేస్తున్న విప‌రీత‌మైన ఖ‌ర్చును, లెక్క‌లు చూపించ‌ని వైనాన్ని కాంగ్రెస్ నేత‌లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. అయితే, కేసీఆర్ వీటిని రాజ‌కీయ కోణంలోనే చూస్తున్నారు. వారిపై విరుచుకుప‌డుతున్నా రు. మీరంతా ద‌ద్ద‌మ్మ‌లు అంటూ తీవ్ర‌స్తాయిలో తిట్టిపోస్తున్నారు. అయితే, ఇప్పుడు మాత్రం కేసీఆర్ ప‌నితీరును ఎండ‌గ‌డుతూ.. కేంద్ర సంస్థ కాగ్‌.. నివేదిక విడుద‌ల చేసింది. పాల‌న‌లో లోపాలు, ఖ‌ర్చులో విచ్చ‌ల‌విడిత‌నాన్ని కాగ్ తూర్పార బ‌ట్టింది. దేశంలోనే పథకాల అమల్లో అగ్ర స్థానంలో ఉన్నామ‌ని.. అన్నింట్లోనూ పారదర్శకతగా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని కేసీఆర్ ఎక్క‌డిక‌క్క‌డ చెప్పుకొంటున్నారు.

ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన….

అయితే, ఈ విష‌యంలో కాగ్ ప్ర‌భుత్వ వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది. ఈ ప‌రిణామంతో కేసీఆర్ ఆయ‌న కూట‌మి కూడా నివ్వెర‌పోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌ను ఎండ‌గ‌డుతూ వ‌చ్చిన ఉద్య‌మ సార‌ధికి ఈ ప‌రిణామం సంక‌టంగా మారే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. కాగ్ వార్షిక నివేదిక ప్ర‌భుత్వానికి అందింది. ప్రభుత్వంలో ఆర్థిక నిబంధనలు, పద్దతులు పాటించ లేదని.. ఆర్థిక నియంత్రణ లోపించిందని తన నివేదికలో స్పష్టం చేసింది. వివిధ పథకాల కోసం డ్రా చేసిన నిధులకు యూసీ(దేనికి ఖ‌ర్చు చేశారో చెప్ప‌డం)లు సమర్పించలేదని.. కొన్ని పథకాలు చేపట్టకుండానే యూసీలు సమర్పించా రని మండిపడింది. కేంద్రం ఇచ్చిన నిధులను కనీసం 50 శాతం కూడా ఖర్చు పెట్టలేక పోయిందని తెలంగాణ ప్రభుత్వంపై కాగ్ అసహనం వ్యక్తం చేసింది.

ఆర్థిక క్రమశిక్షణ లేదంటూ…..

సంక్షేమ పథకాలు..రీ డిజైన్లు, మిషన్ భగీరథ, మైనింగ్‌ వంటి వాటిపై కాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వా నికి ఆర్థిక క్రమశిక్షణ లేదని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఇసుక కొనుగోళ్లు, అమ్మకం, టీహబ్, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాగ్ సవివరమైన నివేదిక ఇచ్చింది. అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేసి 5,820 కోట్ల రుపాయల భారం పడేలా తెలంగాణ సర్కార్ వ్యవహరించిందని కాగ్‌ తెలిపింది. డిస్కంలు వసూలు చేసిన విద్యుత్ చార్జీలు ప్రభుత్వ ఖజానాకు సరైన టైంలో చేరడం లేదని ఆక్షేపించింది. ఇందిర మ్మ వరద కాలువ కోసం 4,711 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అయినా, ఇప్పటి వరకు ఆశించిన ఫలితం రాలేదని కాగ్‌ గుర్తించింది. ఇక, టీ హబ్ రెండో దశ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, తద్వారా ప్రభుత్వానికి 16.70 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్‌ వెల్లడించింది.

ఆయాచిత లబ్ది కూడా…..

ఇసుక కొనుగోళ్లలో అనుయాయులకు 18 కోట్ల రూపాయల మేర ఆయాచిత లబ్ది చేకూర్చారని పేర్కొంది. వాల్టా చట్టం నిబంధనలు పాటించడంలో ప్రభుత్వం విఫలమైందని కాగ్ స్పష్టం చేసింది. ఇక‌, రెవెన్యూ లోటు 5 వేల కోట్ల రూపాయలని, అయితే అప్పు తెచ్చుకున్న నిధులనూ రెవెన్యూ రాబడిగా చూపించి ద్రవ్య లోటును కేవలం 2,500 కోట్ల రూపాయలుగా చూపించారని వివరించింది. ఇక కేంద్రం నుంచి వివిధ రూపాల్లో వచ్చిన నిధులను కూడా నియోగించుకోలేకపోయిందని ప్రభుత్వంపై కాగ్‌ చురకలు అంటించింది. ఇక‌, ఇప్ప‌టికే కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న కాంగ్రెస్‌కు కాగ్ అనే కొత్త ఆయుధం ల‌భించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనికి కేసీఆర్ ఎలా స‌మాధానం చెబుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*