కేసీఆర్ పై రేవంత్ ఆరోపణలు నిజమేనా?

తెలుగు రాష్ట్రాల్లో మీడియా టైగర్స్ లో రేవంత్ ఒకరు. అందులోను తెలంగాణాలో ఆయనకు వున్న క్రేజే వేరు. ప్రస్తుతం టిటిడిపి , ఏపీ టిడిపి నేతలను రేవంత్ టార్గెట్ చేయడం, విదేశాలనుంచి పార్టీ అధినేత హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో మొత్తం మీడియా ఫోకస్ రేవంత్, చంద్రబాబులపైనే. వారిద్దరూ ఏమి మాట్లాడతారన్నదానిపై పార్టీ శ్రేణుల్లోనే కాదు రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా పరిణామాలు గమనిస్తున్నారు. ఇదంతా మీడియా టైగర్ రేవంత్ కి తెలియంది కాదు. అంతే ఆయన తన అమ్ములపొదిలో కేసీఆర్ పై సంధించడానికి సిద్ధం చేసిన బాణాలు ఒక్కోటి వదిలిపెట్టి పనిలో పనిగా టిడిపి పై మరో బాణం వేసి అందరికి షాక్ ఇచ్చారు. కట్ చేస్తే అప్పుడు లైవ్ లు ప్రసారం చేసిన టిడిపి అధికార పార్టీ మీడియా సంస్థలు కానీ, కేసీఆర్ అనుకూల ఛానెల్స్ లో తరువాత రేవంత్ వ్యాఖ్యల ప్రసారమే లేదు.

డ్రగ్స్ కేసు లో కేటీఆర్,ఆయన బంధువులపై …..

సుదీర్ఘ కాలం తెలంగాణాలో డ్రగ్స్ మాఫియా పై పోలీస్ విచారణ నడిచింది. ఎందరో సినీ ప్రముఖులు టార్గెట్ గా ఎక్సయిజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో కూడిన సిట్ టీం దర్యాప్తు చేసింది. సినీ ప్రముఖులు కేసులో ఉండటంతో పెద్ద ఎత్తున ఈ అంశానికి మీడియా లో ప్రాధాన్యత దక్కింది. కధ క్లైమేక్స్ కి వెళ్లే సమయంలో కేసీఆర్ నిందితులు అంతా డ్రగ్స్ బాధితులే అని కేసు ను తుస్సు మనిపించారు. అలా ఎలా జరిగిందో అందరు ఆసక్తికరంగా చర్చించుకున్నా డ్రగ్స్ కేసు పసలేదని సాక్షాత్తు సీఎం తేల్చేయడం తో అందరు దీన్ని మర్చిపోయేలా మాయ చేశారు. ఇప్పుడు ఆ కేసును కెలికారు రేవంత్. అలా ఇలా కాదు చాలా లోతైన విశ్లేషణతో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృస్ట్టించేవే. పైగా సీఎం కేసీఆర్, కేటీఆర్ బంధువుల టార్గెట్ గా ఆయన దాడి మొదలు పెట్టారు.

పనిలో పనిగా పరిటాల కుటుంబంపై ……

డ్రగ్స్ మాఫియా కు అందండలు వెనుక కేటీఆర్ వున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే పరిటాల సునీత కుటుంబాన్ని మరోసారి తెరమీదకు తెచ్చారు. డ్రగ్స్ అందించే హైదరాబాద్ పబ్ లలో పరిటాల కుటుంబానికి వ్యాపారంలో తెలంగాణ ప్రభుత్వం వాటా ఇచ్చిందని ఆరోపించారు. మహారాష్ట్ర , గోవా , కర్ణాటకలో నిషేధించబడిన డీజే బృందానికి రెడ్ కార్పెట్ పరిచి హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ దే అన్నారు రేవంత్. అంతే కాకుండా తనకు పబ్ లకు వెళ్లే అలవాటు ఉందని టిఆర్ ఎస్ ఆరోపించిందని తాను విసిరే సవాల్ కి ఆ పార్టీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నలు సంధించారు. రక్త నమూనాలు , గోళ్లు , వెంటుకలు ఫోరెన్సిక్ బృందానికి తాను ఇచ్చేందుకు సిద్ధమని అదేవిధంగా కేటీఆర్ ఇవ్వడానికి రెడీ నా అని ఛాలెంజ్ చేశారు రేవంత్. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించకుండా ప్రభుత్వం ఎందుకు తనను అడ్డుకుందని నిలదీశారు. అలా అటు టిఆర్ ఎస్ ఇటు సొంత పార్టీని అసెంబ్లీ మీడియా పాయింట్ లో రోడ్డున పడేశారు రేవంత్.

ఇంకేమి చెబుతారా అన్న ఆందోళనలో తమ్ముళ్లు …

రేవంత్ రెడ్డి ఎపిసోడ్ మొదలైంది మొదలు తెలుగు తమ్ముళ్లకు గుబులు పెరిగిపోయింది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్న చందంగా తమ పార్టీ నేతే నిప్పులు కక్కే తూటాలు తమవైపే పేలుస్తుంటే టిడిపి వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితి ని రేవంత్ కల్పించారు. వారితో పాటు గులాబీ దళం కూడా రేవంత్ అంశంలో గుబులుగానే వుంది. టిడిపి టిఆర్ ఎస్ ల లోపలి బంధాన్ని రేవంత్ మరింతగా బహిర్గత పరిస్తే రెండు పార్టీలు ప్రజల్లో రెండు రాష్ట్రాల్లో చులకన అయ్యిపోతాయన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. రాబోయే పరిణామాలను బట్టి రేవంత్ అంశంలో కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకునే పనిలో టిఆర్ ఎస్ ఆచితూచి అడుగులు వేస్తుంది. చంద్రబాబు అదే రీతిలో ముందుకు వెళుతున్నారు. మరి వీరి దాగుడు మూతలు ఎప్పటిదాకానో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*