కేసీఆర్ మోడీని భయపెడుతున్నారా?

తెలంగాణ‌లో అధికారం చేప‌ట్టాలి! ఇది కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు త‌ర‌చుగా చెప్పే మాట‌. ఈ క్ర‌మంలోనే రాష్ట్రానికి వ‌చ్చిన ప్ర‌తిసారీ.. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా పార్టీ జాతీయ సార‌ధి అమిత్ షా, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీలు విమోచ‌న దినం జ‌ర‌పాల‌ని పిలుపు నిచ్చారు. అంతేకాదు, విమోచ‌న దినం ఎందుకు జ‌ర‌ప‌ద్దో తెలంగాణ ప్ర‌భుత్వం వెల్ల‌డించాల‌ని కూడా నేత‌లు డిమాండ్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇక‌, వ‌రంగ‌ల్ త‌దిత‌ర జిల్లాల్లో అమిత్ షా ప‌ర్య‌టించిన స‌మ‌యంలో మ‌రుగు దొడ్లు నిర్మాణం కోసం స్వ‌చ్ఛ భార‌త్ ప‌థ‌కం కింద నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆయ‌న నిప్పులు చెరిగారు.

మెట్రో ప్రారంభోత్సవ సమయంలో కూడా…

ఇక‌, మోడీ కూడా నెల రోజుల కింద‌ట హైద‌రాబాద్ మెట్రో ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన సంద‌ర్భంలో నేరుగా విమానా శ్ర‌యం నుంచి బీజేపీ నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌ద‌స్సుకు వెళ్లి రాష్ట్రంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో దిశానిర్దేశం చేశారు. దీనిని బ‌ట్టి.. తెలంగాణ‌పై బీజేపీ ఎన్ని ఆశ‌లు పెట్టుకుందో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. తెలంగాణ సాధ‌న స‌మ‌యంలో త‌మ నేత సుష్మాస్వ‌రాజ్ ఎంత‌గానో కృషి చేశార‌ని, కేసీఆర్‌కు తోడుగా నిలిచి కాంగ్రెస్‌తో పోరాడార‌ని నేత‌లు గుర్తుచేస్తుంటారు. ఇక‌, 2014లోనే అధికారంలోకి వ‌చ్చేయాల‌ని భావించినా అది దూర‌మైంది. ఈ నేప‌థ్యంలో 2019లో ఎలాగైనా గెలిచి తీరాల‌ని బీజేపీ సార‌ధులు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ మెట్రో వంటి కీల‌క అంశాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేశారు.

రైతు సమస్యలను తీసుకుని….

అయితే, తెలంగాణ ఉద్యమంలోనే కాదు, త‌న పాల‌న విష‌యంలోనూ యోధుడుగా గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్‌… బీజేపీ ఎత్తులు తెలియ‌నంత స్థాయిలో లేరుక‌దా.? అందుకే ఆయ‌న ఎవ‌రికీ అంద‌నంత‌గా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు రైతు వ్య‌తిరేకి అని పడ్డ‌ముద్ర‌ను చెరిపేసుకునే క్రమంలో 24 గంట‌ల ఉచిత విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చారు. కాళేశ్వ‌రం, మిష‌న్ భ‌గీర‌థ‌, గొర్రెల పంపిణీ, బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ, డ‌బుల్ బెడ్రూం వంటి కీల‌క ప‌థ‌కాల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న పాల‌న‌ను వేగంవంతం చేశారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి కేసీఆర్ పేరు రాష్ట్రంలో మార్మోగుతోంది.

గవర్నర్ ద్వారా తెలుసుకుని….

ఇప్పుడు ఇదే విష‌యాన్ని రెండు రోజుల కింద‌ట త‌న‌తో భేటీ అయిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అడిగి మ‌రీ తెలుసుకున్నార‌ట‌. తెలంగాణ‌లో అధికార పార్టీ చేప‌డుతున్న ప‌థ‌కాల‌ను, అమ‌లవుతున్న తీరును కూడా గ‌వ‌ర్న‌ర్ నుంచి ప్ర‌తి విష‌యాన్నీ అడిగి తెలుసుకున్నార‌ట‌. ముఖ్యంగా 24 గంట‌ల ఉచిత విద్యుత్ విష‌యం తెలుసుకుని నోరు వెళ్ల‌బెట్టిన‌ట్టు స‌మాచారం. ఇక‌, ఇలాంటి ప‌థ‌కాలు తాము ఎన్ని ప్ర‌వేశ పెడితే.. తెలంగాణ ప్ర‌జ‌లు బీజేపీకి ఓట్లే స్తారు? వ‌చ్చే సారైనా అధికారంలోకి వ‌స్తామా? అనే ఆలోచ‌న‌లో ప‌డిపోయిన‌ట్టు విశ్లేష‌కులు చెబుతున్నా. ఈ దెబ్బ‌కి.. కేసీఆర్ ప‌థ‌కాల‌తో బీజేపీ ఆశ‌లు ఎండ‌మావేన‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1