కొండా దంప‌తుల ప్లాన్ సూప‌ర్‌

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త, ఎమ్మెల్సీ మురళీధర్ రావుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పట్టుంది. ఏ ఇతర నాయకులకు లేనంతగా బలమైన క్యాడర్ ఉంది. అధికారంలో ఉన్నా, లేకున్నా జిల్లాలో వారి ఆధిపత్యం కొనసాగుతుంది. పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఆయా నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేయగల శక్తి, సామర్థ్యాలున్నాయని కూడా క్యాడర్ చెప్పుకుంటారు. అయితే ఇటీవల ఈ దంపతులిద్దరిపై ఓ ఆసక్తికరమైన కామెంట్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. వీరి పొలిటిక‌ల్ డ‌బుల్ గేమ్ అదిరిపోయింద‌నే అంటున్నారు పాత వ‌రంగ‌ల్ జిల్లా జ‌నాలు. కొండా దంప‌తులు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వద్ద ఇటీవల ఓ ప్రతిపాద‌న పెట్టినట్లు తెలుస్తోంది.

తమ కుమార్తెకు సీటు ఇస్తే….

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరు త‌మ కుమార్తెను పొలిటిక‌ల్ ఎంట్రీ చేయించేందుకు రెడీ అవుతున్నారు. తమ కూతురు కొండా సుస్మితా పటేల్ కు పరకాల టికెట్ కేటాయిస్తే భూపాలపల్లి, పాలకుర్తి, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు బాధ్యతలు తాము తీసుకుంటామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ షరతుకు అంగీకరిస్తే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధిష్ఠానానికి సంకేతాలు పంపినట్లు చర్చ జరుగుతోంది. వాస్తవానికి పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో వీరికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అక్కడి కాంగ్రెస్, టీఆర్ ఎస్ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

కొద్ది ఓట్ల తేడాతోనే…

తెలంగాణ ఉద్యమ సమయంలో పరకాల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున సురేఖ పోటీ చేసి, టీఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇచ్చారు. తెలంగాణ వాదం బలంగా ఉన్న సమయంలో కొద్ది ఓట్ల తెడాతో ఆమె మొలుగూరి బిక్షపతి చేతిలో ఓడిపోయారు. అదే విధంగా పాలకుర్తిలో ఎమ్మెల్యే దయాకర్ రావుతో రాజకీయంగా మొదటి నుంచి తీవ్ర వైరుధ్యం ఉంది. ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో జంగా రాఘవరెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకుల్లో ఓ కీలక నాయకుడు కొండా మురళి సన్నిహితుడన్నట్లు సమాచారం.

సీఎం నుంచి సానుకూలత రాకపోవడంతో….

ఎర్రబెల్లి దయాకరరావును ఓడించడమే లక్ష్యంగా సంఘం కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ మూడు నియోజకవర్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద కూడా పెట్టినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. కాగా సీఎం నుంచి సానుకూల హామీ రాలేదని, దీంతో కొండా దంపతులు కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ పార్టీ వీరి ప్రతపాదనకు ఓకే చెబుతుందా.. ఒక వేళ అంగీకరిస్తే ఆ నాలుగు నియోజకవర్గాలను కొండా దంపతులు గెలిపించుకుంటారా…అనేది తేలాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*