
కోడి స్వామ్యం వర్ధిల్లుగాక!!- ప్రజాస్వామ్య హితౌషిలైన మన ప్రజాస్వామ్య ప్రజా ప్రతినిధుల నోట.. మోటంగా.. వాటంగా వస్తున్న, వినిపిస్తున్న మాట ఇదే! అప్రతిహతంగా పలవరిస్తున్న ఉలుకులేని పలుకూ ఇదే! ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారంతా `కోడ్`ను తొక్కో.. నొక్కో.. కోడి స్వామ్యాన్ని కాపాడాలని వేనోళ్ల వారు చేస్తున్నడిమాండ్ కూడా ఇదే! ఇదే!! ఇదే!!! అంతేనా.. ప్రజాస్వామ్యాన్ని కోరుతున్నారు వారు.. కోడి స్వామ్యాన్నికోరుకోరా? స్వేచ్ఛ మనుషులకేనా కోళ్లకు వద్దా? కొట్టుకునేది మనమేనా? అవి మాత్రం కొట్టుకోవద్దా? ఇంత పెద్ద దేశంలో కోళ్లకు కొట్టుకునే స్వేచ్ఛ ఉండొద్దా? ఛస్!! కోళ్ల కొట్లాటపై.. అసలు.. ఆంక్షలేంటి? వాటి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని హరించడమేంటి? కోళ్లేమన్నా.. బ్రిటీష్ పాలనలో ఉన్నాయా? అంటూ ప్రశ్నా వాచకాలతో విస్మయం ఒలకబోస్తూ.. కోళ్ల పక్షాన పక్షం రోజులుగా.. వకాల్తా పుచ్చుకుని పృచ్ఛిస్తున్నవారూ వీరే!
కోళ్లున్నది కోసుకు తింటానికేనా….
`కొడకా.. కోటేశ్వర్రావా!` అని పవన్ పాడితే విన్నవారు.. విని ఆనందించిన వారు.. `కొడకా.. కుక్కుటేశ్వర్రావా!` అంటే వినలేరా? అవి తన్నుకుంటే.. కన్నులార కని.. కనుల `పండగ` చేసుకోలేరా? అని ప్రశ్నలు సంధించేస్తున్నారు! పొగతాగని వాడు ఎలా పుడతాడో గురజాడవారు చెప్పేశారు కాబట్టి.. నిషేధం ఉన్నా.. బహిరంగంగా తాగొద్దన్నా.. కేసులు కట్టి కోర్టుకు ఈడుస్తున్నా.. గుప్పు గుప్పున పీల్చి సిగరెట్ పీకను పిప్పి చేస్తున్నారని, మరి.. కోడి పందాలు ఆడనివాడు ఎలా పుడతాడో ఇప్పటి వరకు ఎవరూ చెప్పకపోవడం వల్లే వాటిని వద్దంటున్న వారు పెరిగిపోతున్నారని ఈసడించేస్తున్నారు!! కోళ్లున్నది కోసుకు తింటానికేనా.. కొట్టుకోనివ్వడానికి కూడా!! అంటూ సరికొత్త భాష్యాలకు పదును పెట్టేస్తున్నారు. అయినా వద్దని అంటే.. కోళ్లను కొట్టుకోనివ్వని పాపం శాపంగా మారి మిమ్మల్ని.. మీ కుటుంబాల్ని`పొడిచి` `పొడిచి` చంపేస్తుందని శాపనార్థాలు పెట్టేస్తున్నారు.
రంజైన పుంజు చేతిలో ఉంటే….
`అయ్యగారికీ దండం పెట్టు..` అని గంగిరెద్దుల వాడు ఎద్దును అలంకరించి ఆడిస్తుంటే.. `దొరగారికీ మస్కా కొట్టు.. గిరిలను గీసి.. బరులను పెట్టు!` అని మన నేతలు పుష్ఠిగా మేపిన పుంజులతో అధికారులను ఓడిస్తూ.. న్యాయ వ్యవస్థ లొసుగులతో `ఆట` ఆడేస్తున్నారు!! సంక్రాంతి తెలుగు వారికి ప్రత్యేకం! ఆ మాటకొస్తే.. ఇక్కడే పుట్టిందనే పండిత ప్రతినిధులూ కోకొల్లలు. మరి ఇక్కడ పుట్టిన పండక్కి.. ఓ ఆట.. పాట ఉండొద్దా..? పండగ పూటా పాత మొగుడేనా అన్నట్టు.. సంక్రాంతినాడూ ఏబ్రాసి సినిమాలు.. గుళ్లు.. హాళ్లు.. పార్కులేనా..? రంజైన పుంజును చేతపట్టక పోతే.. పండగెక్కడ? పట్టిన పంజుతో పందెం కట్టకపోతే.. ఇక, రంజెక్కడ?! అందుకే.. మన నాయకులు వినాయకులై.. బొజ్జలూపుతూ.. వాటమైన పుంజును పట్టి.. తగిన వారితో జోడీ కట్టి.. ఎవ్వరు చూడని చోటును `చుట్టి`.. నోటు నోటుపై పోటీ పెట్టి.. పోటా పోటీ జబ్బలు కొట్టి.. పందాలకు సిద్ధమైపోతున్నారు!!
కొసమెరుపు!
మన వారు `ఉత్త` వెధవాయ్లోయ్ అని గురజాడ వారు అప్పుడెప్పుడో ఉవచించి.. ర`చించేశారు` కానీ.. నిజానికి ఆయనే ఇప్పుడుండాల్సి వస్తే.. కోడి-ఢీ-లఢాయి గురించి రాయాల్సి వస్తే.. మనవారు `ఉత్తమ` వెధవాయ్లోయ్! అని ర`చించకుండా` మాత్రం ఉండేవారు కాదు!! ఏమంటారు!!?
Leave a Reply