కోడెల కోటలో జగన్ దండయాత్ర

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గంలోకి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రవేశించింది. కోడెలకు, తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు పట్టున్న నియోజకవర్గం నరసరావుపేట. కోడెల ఆధిపత్యానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లోనే గండికొట్టారు. వైఎస్ హవాలో 2004లో కోడెల శివప్రసాదరావు నరసరావుపేట నుంచి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇక నరసరావుపేటలో కోడెల విజయ బావుటాను ఎగుర వేయలేకపోయారు. డాక్టర్ గా కోడెల రాజకీయప్రస్థానం ప్రారంభమయింది కూడా నరసరావుపేట నుంచే. నరసరావుపేటలో పట్టున్న కోడెలకు దశాబ్దకాలంగా పట్టుతప్పిందనే చెప్పొచ్చు.

టీడీపీకి కంచుకోటగా….

నరసరావుపేట నియోజకవర్గం 1955లో ఏర్పడింది. అప్పటి నుంచి వరుసగా 1955, 1962, 1967, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాసు బ్రహ్మానందరెడ్డి కూడా నరసరావుపేట నుంచే కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అయితే 1983లో కోడెల శివప్రసాదరావు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. దాదాపు పదిహేను వేల ఓట్ల మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కోడెల ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థిగా 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. అయిదుసార్లు వరుసగా గెలిచిన కోడెలకు 2004లో కాసు వెంకటకృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలచి బ్రేక్ వేశారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయిన కోడెల, 2014 ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది స్పీకర్ అయ్యారు.

వైసీపీకి అనుకూలంగా మారి….

నరసరావుపేట నియోజవర్గంలో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బీజేపీ అభ్యర్థి నల్లబోతు వెంకటరావుపై దాదాపు పదిహేను వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించి ఫ్యాన్ ను నరసరావుపేటలో తిరిగేలాచేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో తిరిగి కోడెల శివప్రసాదరావు నర్సరావుపేట నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు. సత్తెన పల్లిలో వ్యతిరేకత పెరగడంతో ఆయన మూడు సంవత్సరాల నుంచి నరసరావుపేట మీద దృష్టి పెట్టారు. ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ పేట ప్రజలకు దగ్గరయ్యేందుకు కోడెల విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.

జగన్ పాదయాత్రతో….

ఈ పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర నరసరావుపేట నియోజకవర్గంలో ప్రారంభమైంది. నరసరావుపేటలో జరిగిన బహిరంగ సభకు అశేష జనం హాజరుకావడంతో వైసీపీ నేతల్లో సంతోషం నింపింది. కోడెల తిరిగి ఇక్కడ పోటీచేసినా విజయం తమదేనన్న ధీమాతో వైసీపీ నేతలు ఉన్నారు. జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలే నివ్వెరపోయారని వైసీపీ నేతలు తెగ సంబరపడిపోతున్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగాలేరని, చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ దుయ్యబట్టారు. మొత్తం మీద కోడెల కోటలో జగన్ దండయాత్ర కొనసాగుతోంది.\

120వ రోజుకు చేరుకున్న పాదయాత్ర…..

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 120వ రోజుకు చేరుకుంది. ఆయన ప్రస్తుతం నరసరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి నరసరావుపేటలో బస చేసిన జగన్ ఈరోజు ఉదయం అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభిస్తారు. నరసరావుపేట నుంచి బరంపేట, బీసీకాలనీ, ఇసొప్పపాలెం, ములకలూరు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం జగన్ అక్కడి నుంచి గొల్లపాడు, ముప్పాళ్ల వరకూ పాదయాత్రను చేస్తారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు. ఇప్పటి వరకూ జగన్ 1586 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*