కోదండరామ్ ఆ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు?

తెలంగాణలో కొత్త పార్టీ ప్రకటన తేదీ ఖరారయిపోయింది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చే నెల 10వ తేదీన పార్టీని ప్రకటించనున్నారు. కోదండరామ్ పార్టీ ప్రకటనతో ఇటు అధికార పార్టీలో, విపక్షంలోనూ కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. కోదండరామ్ పార్టీ ప్రకటన చేయడానికి మార్చి పదో తేదీనే ఎంచుకోవడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. మార్చి పదో తేదీన మిలియన్ మార్చ్ నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు. అందుకే మార్చి 10వ తేదీన పార్టీ ప్రకటన చేయాలని ప్రొఫెసర్ నిర్ణయించుకున్నారు.

మిలియన్ మార్చ్ జరిగిన రోజు….

అయితే మార్చి పదో తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించాలని కోదండరామ్ యోచిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి జేఏసీని అభిమానిస్తున్న వారిని రప్పించి పార్టీని ప్రకటించాలన్నది ఆయన నిర్ణయంగా కన్పిస్తోంది. మొదట ఈ నెలలోనే పార్టీని ప్రకటించాలని భావించినప్పటికీ ఆయన మిలియన్ మార్చ్ జరిగిన రోజైతే బాగుంటుందని పలువురు సూచించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మార్చి పదో తేదీన భారీ బహిరంగ సభలో పార్టీని ప్రకటించడమే కాకుండా పార్టీని ఎందుకు పెట్టింది? తెలియచేయనున్నారు.

భారీ బహిరంగ సభలో…..

అంతేకాకుండా పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలను కూడా కోదండరామ్ ప్రజలకు తెలియజేయనున్నారు. అయితే ఈ బహిరంగ సభ ఎక్కడ పెట్టాలా? అన్నది ఇంకా నిర్ణయించలేదు. వరంగల్ లో అయితే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన వరంగల్ లో అయితే సక్సెస్ అవుతుందని కూడా కొందరు చెబుతున్నారు. అయితే సభ ఎక్కడన్నది ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జేఏసీ నేతలు చెప్పారు. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ ను కూడా పూర్తి చేశామని చెప్పారు. తెలంగాణ జన సమితి పేరుతో కోదండరామ్ ప్రజల ముందుకు రానున్నారు. పార్టీ ప్రకటించడానికి ముందు కోదండరామ్ జేఏసీ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద పెద్దాయన పార్టీ తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఆసక్తిని రేపుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1