క‌మ‌ల నాథుల‌ను అదే ముంచేస్తుందా?

కమలనాథులపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఓవైపు దక్షిణాదిన కీలక రాష్ట్రం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన విపక్షాలు.. తాజాగా కావేరి జలాలు యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే కోర్టు ధిక్కార పిటిషన్ వేయాలని చూస్తోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి కి కావేరీ జలాల కేటాయింపులు జరిగేలా యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆరువారాల గడువు విధించింది.

బోర్డు ఏర్పాటు చేయకుండా….

ఈ గడువు ముగిసినా కేంద్ర ప్రభుత్వం కావేరి జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ శనివారం వేయాలని అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సమక్షంలో సమావేశం జరిగింది. అయితే కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ కావేరి జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయడం లేదనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ హీరో కమలహాసన్ ఘాటుగా స్పందించారు.

తమిళనాడుకు అది అవసరం….

నిజానికి లోక్ సభ సమావేశాల్లో కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ తీవ్ర ఆందోళన చేపట్టారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. టీడీపీ, వైఎస్సార్ సీపీలు కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండా ఉండేందుకే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేస్తున్నారనీ.. బీజేపీ చేతిలో అన్నాడీఎంకే కీలుబొమ్మగా మారిందనే విమర్శలు వచ్చాయి. అయితే తమిళనాడులో కూడా కావేరి జలాల విషయంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తమిళనాడుకు అనుకూలంగా వ్యవహరిస్తే….

ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు.. బీజేపీ చేతిలో తాము కీలుబొమ్మగా మారలేదని నిరూపించుకునేందుకే కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయాలని అన్నాడీఎంకే నిర్ణయం తీసుకున్నట్లు పలువురు నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో బీజేపీ పరిస్థితి ముందకెళ్తే నుయ్యి.. వెనక్కి పోతే గొయ్యిలా తయారైంది. కావేరి జలాలు విషయంలో ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం నెలకొంది. ఈ సమయంలో తమిళనాడు కు అనుకూలంగా వ్యవహరిస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నుంచి గట్టి దెబ్బపడుతుంది. మరోవైపు నిజంగానే అన్నాడీఎంకే కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే కర్ణాటక లో బీజేపీకి ప్రతికూల పరిస్థితి నెలకొంది. పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేలు మాత్రం మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*