క‌విత – కేటీఆర్ మ‌ధ్య మంథ‌ని చిచ్చు

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్‌కు ఆయ‌న చెల్లెలు, నిజామాబాద్ ఎంపీ క‌వితకు మ‌ధ్య నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న స‌ఖ్య‌త కాస్తా ఓ విష‌యంలో కాస్త తేడా వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. బ‌తుక‌మ్మ చీరల విష‌యంలో క‌విత‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు కేటీఆర్ ఆదుకున్నారు. ఆమెపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు. ఇక నిజామాబాద్‌లో డీఎస్ త‌న‌యుడు అర‌వింద్ బీజేపీలో చేర‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకోవ‌డంతో క‌విత ఒక్క‌సారిగా కాస్త టెన్ష‌న్ ప‌డ్డారు. ఆ వెంట‌నే కేటీఆర్ నిజామాబాద్‌లో ఎంట్రీ ఇచ్చి త‌న శాఖా ద్వారా అక్క‌డ ఐటీ ప్రాజెక్టు మంజూరు చేస్తున్న‌ట్టు హామీ ఇవ్వ‌డంతో పాటు రాజ‌కీయంగా డీఎస్ మ‌న‌తో క‌లిసొచ్చినా లేకున్నా మిగిలిన వారంద‌రూ త‌న సోద‌రికి అండ‌గా ఉండాల‌ని చెప్పిమ‌రీ క‌విత‌కు టెన్ష‌న్ లేకుండా చేశారు.

చెల్లెలికి వ్యతిరేకంగా….

అయితే, తాజాగా ఓ విష‌యంలో మాత్రం కేటీఆర్‌ చెల్లెలికి వ్యతిరేకంగా ఈయ‌నే ఇప్పుడు చక్రం తిప్పుతున్నార‌ట‌! విన‌డానికి ఆశ్చ‌ర్యంగా అనిపించినా క‌రెక్టే అన్న గుస‌గుస‌లు టీఆర్ఎస్‌లోనే వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. రాజ‌కీయంగా ప్రాధాన్యం ఉన్న పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌నిలో అధికార పార్టీ టీ ఆర్ ఎస్ వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ మంథ‌ని టికెట్ విష‌యంలో నేత‌ల‌కు ఒకరిపై ఒక‌రు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ.. క‌త్తులు నూరుకుంటున్నారు. ఇక్క‌డి సిట్టింగ్ ఎమ్మెల్యే పుట్టా మ‌ధుకు కేసీఆర్ కుమార్తె క‌విత నుంచి ఆశీస్సులు ఉన్నాయి. దీంతో 2014లో ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. బీసీ వ‌ర్గానికి చెందిన మ‌ధు 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున పోటీ చేసి మాజీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీథ‌ర్‌బాబుకు గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆయ‌న వైసీపీలోకి జంప్ చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు క‌విత అండ‌దండ‌ల‌తో బీసీ కోటాలో ఆయ‌న టిక్కెట్ ద‌క్కించుకుని మూడుసార్లు గెలుస్తూ వ‌స్తోన్న శ్రీథ‌ర్‌బాబును ఓడించి పెద్ద సంచ‌ల‌నం రేపారు. అయితే, ఇదే ప్లేస్ నుంచి పార్టీ కోసం ఎప్ప‌టినుంచో శ్రమించిన చందుప‌ట్ల సునీల్ రెడ్డి, ఈయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయింది. పార్టీ అధినాయ‌క‌త్వంతో మూడేళ్ల నుంచి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ క్రియాశీలకంగా మారిన సునీల్‌రెడ్డి తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాస్తవానికి మ‌ధు టీఆర్ఎస్‌లో చేర‌క‌ముందు సునీల్‌రెడ్డి, రామిరెడ్డి ఇద్ద‌రూ ఇక్క‌డ పార్టీని ఎంతో బ‌లోపేతం చేశారు. మ‌ధు ఎమ్మెల్యే అయ్యాక వీళ్ల‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది.

కవిత మద్దతు ఆయనకే….

దీంతో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంథని టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కాగా, గ‌త ఎన్నిక‌ల్లో మధు గెలుపుతో మంథని అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని భావించిన నియోజకవర్గ ప్రజలకు నిరాశే ఎదురైంది. దీంతో పద్ధతి మార్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు సందర్భాల్లో మధును హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడం.. పార్టీ అధినాయకత్వం ఇతని విషయాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఇక‌, మ‌రోప‌క్క‌, మ‌ధుపై పోరుబావుటా ఎగ‌రేసిన సునీల్ రెడ్డిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిల‌బెట్ట‌డం ద్వారా గెలుపు గుర్రం ఎక్కాల‌ని కేటీఆర్ భావిస్తున్నార‌ట‌. దీంతో ఆయ‌న సునీల్ రెడ్డికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ట్టు స‌మాచారం. ఇటు మ‌ధుకు క‌విత మ‌ద్ద‌తు ఉంది. దీంతో ఇప్పుడు మంథ‌ని సీటును తాము చెప్పిన వాళ్ల‌కే ఇప్పించుకోవాల‌ని ఈ అన్నాచెల్లెల్లు ఇద్ద‌రూ గ‌ట్టి ఫైట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. అయితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంథని ఎమ్మెల్యే మధు కూడా టికెట్‌ ఇస్తారా.. అన్న అంశంపై టీఆర్‌ఎస్‌ నాయకుల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు మంథనిలో ఇద్దరు టీఆర్‌ఎస్‌ నేతల మధ్య ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అయితే, త‌న‌కు క‌విత మద్ద‌తు ఉంటుంద‌ని మ‌ధు, లేదు త‌న‌ను కేటీఆర్ ఆదుకుంటార‌ని సునీల్ ఇలా ఎవ‌రికి వారే అంచ‌నాలు వేసుకుని ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

1 Comment on క‌విత – కేటీఆర్ మ‌ధ్య మంథ‌ని చిచ్చు

  1. ఇప్పుడు ఒక పాట !
    ” ఎవరికెవరు ఈ లోకం లో … ఎవరికి ఎరుక ?
    ఏ దారెటు పోతుందో .. ఎవరికీ తెలియకా … !
    కోచై మాచై కోరంగి రేవుకై – కోటిపల్లి రేవుకై … ”

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1