గన్ కావాలా…బాబూ అయితే…?

గన్…ఇప్పుడిదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. కత్తికన్నా.. గన్ బెటర్ అని భావిస్తున్నారు చాలా మంది. అందుకే ఛోటా నుంచి బడా కేసుల వరకు దీనికే పని చెబుతున్నారు. నాడు దిగుమతి స్టేజ్ లో ఉన్న మనం ఇప్పుడు ఎగుమతి స్టేజ్ కి చేరాం. గుట్టుచప్పుడు కాకుండా ఫ్యాక్టరీనే పెట్టి ఆయుధాలు తయారు చేసే స్థితికి మారాం. అయితే అడపాదడపా అరెస్ట్లులు తప్ప.. అసలు సూత్రధారుల అంతే చిక్కడం లేదు. రాజధాని అంగట్లో ఆటవస్తువుల్లా మారిన గన్ కల్చర్ పై ఓ రిపోర్ట్.

ఆయుధాలకు అడ్డాగా…..

నగరం ఆయుధాల విక్రయాలకు అడ్డాగా మారింది. అంగట్లో ఆటబొమ్మల్లా మారణాయుధాలు విచ్చలవిడిగా అమ్ముడవుతుండటంతో పోలీసులకు మింగుడుపడని వ్యవహారమైంది. వంద మందిలో సగానికి పైగా గన్ వాడుతున్నారని తెలియడంతో వాటిని ఎలా అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనలో పడ్డారు. ఇతర రాష్ట్రాల నుండి తుపాకులు కొనుగోలు చేసి వాటిని సిటీలో అమ్ముతున్న ముఠాలు పట్టుబడుతూ ఉంటే.. ఏకంగా శివారు ప్రాంతంలో వీటి తయారీ ఫ్యాక్టరీనే వెలుగు చూడటం పోలీస్ బాస్ లను ఖంగుతినేలా చేసింది.

పోలీసులు అవాక్కయ్యారు….

వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం ధోర్నల్ ప్రాంతంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు ఓ ప్యాక్టరీపై దాడులు జరిపారు. లోపలికి వెళ్లిన పోలీసులకు అక్కడి పరిస్థితులు ముచ్చెమటలు పట్టించాయి. నాటు తుపాకులు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయని తెలిసి విస్మయానికి గురైనారు. ఇప్తిఖార్, ముస్తాక్ అనే వ్యక్తులు బీహార్ నుండి నగరానికి వచ్చి శివారు ప్రాంతమైన ధోర్నల్ ను తమ వ్యాపారానికి అనువుగా మార్చుకున్నారు. మొదట్లో బీహార్ నుండి ఆయుధాలు తీసుకు వచ్చి ఇక్కడ విక్రయించే వారు. రాను రాను ఈ వ్యాపారంలో మంచి లాభాలు రావడంతో గన్స్ తయారీ ఫ్యాక్టరీనే నెలకొల్పారు.

ఏడాది నుంచి తయారీలో….

దాదాపు సంవత్సర కాలంగా వీరు ఈ ఫ్యాక్టరీలో తుపాకులు తయారు చేసి వాటిని నగరంలో విక్రయించడమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా సప్లయ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు లక్షల రూపాయల నుండి మొదలు 20వేల రూపాయల వరకు గన్స్ ను విక్రయిస్తున్నారు. రేటును బట్టి ఆయుధం ఉంటుందని చెబుతున్నారు. అంతే కాదు ఈ ఆయుధాల ఫ్యాక్టరీలో మరో 30 మందికి పైగా పని చేస్తున్నారని తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లే ఎక్కువగా గన్స్ కొనుగోలుకి ఆసక్తి చూపిస్తున్నారని, పోలీసుల నుండి లైసెన్స్ గన్ పొందాలంటే సవాలక్ష పార్మాలిటీలు ఉంటాయి. అయితే 20 వేలు పడేస్తే అంగట్లో ఆయుధం లభించడంతో లైసెన్స్ కన్నా అక్రమ ఆయుధమే బెటర్ గా భావిచండంతో ఇప్తికార్, ముస్తాక్ ఈ వ్యాపారాన్ని జోరుగా నడుపుతన్నట్లు తెలిసింది.

సిటీలో కూడా ఉన్నాయా?

కేవలం థారూర్ ప్రాంతంలో నే కాకుండా సిటీలో ఇంకా ఎక్కడెక్కడ ఈ తరహా అక్రమ ఆయుధాల ఫ్యాక్టరీలు ఉన్నాయన్న వ్యవహారమై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిటీలో తిష్టవేసిన ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ముందుగా అదుపులోకి తీసుకుంటే వాటి వివరాలు ఇట్టే తెలిసి పోతాయని భావిస్తున్నారు. అందుకే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండతో పాటు వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డిజిల్లాల్లో సైతం పెద్దఎత్తున కార్డన్ సర్చ్ నిర్వహించాలని డిజిపి ఆదేశాలు జారీ చేశారు.మొత్తానికి డ్రగ్స్, ఆయుధాలు దిగుమతి స్థాయి నుండి ఇప్పటి సిటీ ఎగుమతి స్థాయి వరకు పెరిగిపోయిందని పట్టుబడిన నిందితులతో స్పష్టమౌతోంది. సంవత్సర కాలంగా అక్రమ ఆయుధాల ఫ్యాక్టరీనే నడుస్తోంది అంటే నిందితులు ఎంత పెట్రేగి పోతున్నారో తెలుస్తోంది. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు 34 తుపాకులు, సంచుల కొద్దీ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*