గల్లా గల్లీలో జగన్ హల్ చల్…!

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి గతంలో ప్రాతినిధ్యం వహించిన చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామం నారావారి పల్లి కూడా ఇదే నియోజకవర్గంలో ఉండటం విశేషం. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత గల్లా ఫ్యామిలీ ఈ నియోజకవర్గంపై పట్టు పెంచుకుంది. 1989లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గల్లా అరుణకుమారి విజయంసాధించారు. 1994లో ఇక్కడి నుంచి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గెలుపొందారు. ఆ తర్వాత వరసగా 1999, 2004, 2009 ఎన్నికల్లో గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

నాలుగు సార్లు గెలిచినగల్లా…..

అయితే 2014లో మాత్రం రాష్ట్ర విభజన నేపథ్యంలో గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. చంద్రగిరి నియోజకవర్గం అంటేనే గల్లా కుటుంబానికి పట్టున్న ప్రాంతం. అయితే గత ఎన్నికల అనంతరం పరిస్థితి మారిందనే చెప్పొచ్చు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రజలకు అందుబాటులో నిత్యం ఉండటం, ప్రజాసమస్యలపై పోరాటం చేస్తుండటంతో ఆయన కొంత బలాన్ని ఇక్కడ పెంచుకోగలిగారు.

పట్టుపెంచుకుంటున్న చెవిరెడ్డి….

ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువగా జరగనుంది. పాతవేపకుప్పం, ఎల్వీపురం, నేతకుప్పం, తిమ్మరాజు పల్ి, గొల్లపల్లి, సి.కాలేపల్లి, చిటతూరు, హరిజనవాడ, రాయలచెరువు, కుప్పం బాదురు వరకూ పాదయాత్ర కొనసాగింది. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండటంతో జగన్ పాదయాత్రకు జనం పెద్దయెత్తున తరలి వస్తున్నారు. అందంగా అలంకరించిన ట్రాక్టర్లు, మేళతాలాలతో గ్రామ ప్రజలు అడుగడుగునా జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. 200 మంది మహిళలు ఒకేసారి జగన్ కు హారతి పట్టడం విశేషం.

సంక్రాంతి ఇక్కడే….

ఇక ఇదే నియోజకవర్గంలో జగన్ తన కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకోనున్నారు. సంక్రాంతి పండగను జగన్ చంద్రగిరి నియోజకవర్గంలోనే జరుపుకోనున్నారు. ఇందుకోసం వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ బసచేసే ప్రాంతంలో పండగ శోభ వచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. జగన్ కుటుంబం మొత్తం ఇక్కడకు పండగ జరుపుకునేందుకు వస్తుండటంతో అవసరమైన తాత్కాలిక వసతిని కూడా ఏర్పాటు చేసే పనిలో ఇప్పుడు వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు. మొత్తం మీద గల్లా గల్లీలో జగన్ హల్ చల్ చేస్తుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1