‘‘గాలి’’ లేకుంటే కమలం వికసించేదా?

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి పట్టుదలకు పోతున్నారా…? తనను బీజేపీ దూరం పెట్టినందుకు మనస్తాపం చెందుతున్నారా? అంటే అవుననే అంటున్నారు గాలి అనుచరులు. గాలికి ఘోర అవమానం జరిగిందంటున్నారు. బీజేపీని కర్ణాటకలో బళ్లారి జిల్లాలో నిలబెట్టింది ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ‘గాలి’ లేకపోతే బీజేపీ కర్ణాటకలో గతంలో జెండా ఎగరేసేదా? అని నిలదీస్తున్నారు. ఇంతకీ గాలి జనార్థన్ రెడ్డికి ఎందుకంత కోపం వచ్చిందంటే… అమిత్ షా వ్యాఖ్యలతోనే. గాలి జనార్థన్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నా బీజేపీలోనే ఉన్నట్లు లెక్క.

అమిత్ షా వ్యాఖ్యలతో…..

ఆయన గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. బెయిల్ పై బయటకు వచ్చిన గాలి కేసుల నుంచి కేంద్ర ప్రభుత్వం బయటపడేస్తుందని ఆశించారు. కాని అది జరగలేదు. పోనీ వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించారు. గాలి జనార్థన్ రెడ్డి బళ్లారి నుంచి పోటీ చేస్తారని ఆయన తమ్ముడు సోమశేఖర్ రెడ్డి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో గాలి జనార్థన్ రెడ్డి తిరిగి రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం అంగీకరిస్తుందనుకున్నారు.

సోదరుడిని స్వతంత్ర అభ్యర్థిగా…..

కాని కథ అడ్డం తిరిగింది. అమిత్ షా గాలి జనార్థన్ రెడ్డికి, బీజేపీకి సంబంధం లేదని మీడియా ఎదుట కుండ బద్దలు కొట్టేశారు. దీంతో గాలి జనార్థన్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురై ఈరోజు బళ్లారిలో తన అనుచరులతో సమావేశమయ్యారు. తన సోదరుడు సోమశేఖర్ రెడ్డిని బళ్లారి నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగానే సోమశేఖర్ రెడ్డని బరిలోకి దింపాలన్నది గాలి ఆలోచన. ఏ పార్టీతో సంబంధం పెట్టుకోకుండా తన సత్తా ఏంటో బీజేపీ పెద్దలకు తెలియజేయాలని గాలి భావిస్తున్నారు. మొత్తం మీద గాలి జనార్థన్ రెడ్డి అనుకున్నట్లుగా కేంద్ర నాయకత్వం స్పందించక పోవడంతో స్వతంత్రంగా తన తమ్ముడిని రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*