గుడివాడలో కొడాలి నాని ఫుల్ హ్యాపీస్….ఎందుకంటే?

రాజధాని ప్రాంతంలో టీడీపీకి అగచాట్లు తప్పేలా లేవు. అధికారంలో ఉన్నామన్న మాటే గాని పదవుల కోసం పార్టీ నిర్ణయాలనే వ్యతిరేకిస్తున్నారు. అధినేత డెసిషన్స్ ను పక్కన పెట్టి మరీ తగువులాడుకుంటున్నారు. రాజధానికి అతిసమీపంలో ఉన్న గుడివాడలో తెలుగు తమ్ముళ్లు పదవుల కోసం తన్నుకుంటున్నా హైకమాండ్ మాత్రం పట్టించుకోవడం లేదు. గుడివాడ అంటేనే పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు జన్మించిన నిమ్మకూరుకు అతి దగ్గరలోనే ఉంటుంది. గుడివాడలో వైైసీపీ ఎమ్మెల్యేగా కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించాలంటే తెలుగుదేశం పార్టీ మొత్తం సమిష్టిగా పనిచేయాల్సి ఉంటుంది. గుడివాడలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది. గుడివాడ నియోజకవర్గానికి మంత్రి లోకేష్ కూడా టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ ఇన్ ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఉన్నారు.

తెలుగు తమ్ముళ్ల మధ్య వార్…..

అయితే గత కొద్ది రోజులుగా గుడివాడలో తెలుగుతమ్ముళ్లు కొట్టుకుంటున్నారు. అదీ పదవుల కోసమే. టీడీపీ వర్సెస్ టీడీపీ వార్ గుడివాడలో ప్రారంభమయింది. ఈ వార్ కు ప్రధాన కారణం గుడివాడ మార్కెట్ యార్డు ఛైర్మన్ గిరీ. గుడివాడ మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ గా పార్టీ అధిష్టానం ఆరికపూడి వెంకటరామ శాస్త్రిని నియమించింది. అయితే ఈ నియామకం పట్ల అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత పెదబాబు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. శాస్త్రి లోకల్ కాదంటున్నారు. నాన్ లోకల్ కు పదవి ఇవ్వడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాని పెదబాబు మాటలను అధిష్టానం లైట్ తీసుకుంది. దీంతో ఆయన ఈ నియామకంపై హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా గుడివాడ మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవిని శాస్త్రికి ఇచ్చారని ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. పెదబాబు పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టుకు వెళ్లడంతో పెదబాబు దగ్గరకు పార్టీ నేతలు పరుగులు పెడుతున్నారు. అయినా పెదబాబు వర్గం మాత్రం పట్టించుకోవడం లేదు. తాము మూడు దశాబ్దాల నుంచి పార్టీకి పని చేస్తుంటే ఎవరో ఒకరికి పదవిని కట్టబెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాను న్యాయపరంగానే పోరాడుతానంటున్నారు. ఈ పంచాయతీ బాలయ్య బాబు వద్దకు తీసుకెళ్లాలని కొందరు భావిస్తున్నారు. గుడివాడ టీడీపీలో జరుగుతున్న తెలుగు తమ్ముళ్ల పంచాయతీని చూసి ఎమ్మెల్యే కొడాలి నాని హ్యపీ అవుతున్నారు. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తన గెలుపు తధ్యమంటున్నారు నాని అనుచరులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1