గులాబీ బాస్ స్కెచ్ అదిరింది కదూ….!

సంక్రాంతి పండ‌గ పూట రెండు రాష్ట్రాల్లోనూ కోళ్లకు క‌త్తులు క‌డుతుంటే.. తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రాజ‌కీయంగా విప‌క్షాల‌పై క‌త్తులు క‌ట్టారు! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. త‌న‌పై ఒంటికాలితో ఎగిరెగిరి ప‌డుతున్న విప‌క్షాల‌కు చాచి పెట్టి కొట్టేలా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. ఒక్క నిర్ణయంతో వారిని ఉక్కిరి బిక్కిరి చేసేలా పావులు క‌దుపుతున్నారు. ఈ దెబ్బతో తెలంగాణ‌లో విప‌క్షాలో.. కేసీఆరో..? తేల్చుకునేందుకు గులాబీ బాస్ సిద్ధమ‌య్యారు. విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణ‌లోని గ్రామ పంచాయ‌తీల‌కు గ‌డువు క‌న్నా ముందే ఎన్నిక‌లు నిర్వహించాల‌ని కేసీఆర్ ప్రాథ‌మికంగా నిర్ణయించేశారు. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు, మంత్రుల‌తో ఆయ‌న స‌న్నాహ‌క స‌మావేశం కూడా నిర్వహించేశారు. కేసీఆర్ ఆలోచ‌న‌ల ప్రకారం ఫ్రిబ్రవ‌రి రెండోవారంలోనే పంచాయ‌తీల‌కు న‌గారా మోగ‌నుంది.

పంచాయతీలకు ఎన్నికలు….

ఫ‌లితంగా ఇది విప‌క్షాల‌కు పెనం మీద నుంచి పొయ్యిలోకి ప‌డిన ప‌రిస్థితిని త‌ల‌పిస్తుంద‌ని కేసీఆర్ భావిస్తున్నారు. నిజానికి గ్రామ పంచాయ‌తీ పాల‌క వ‌ర్గాల‌కు ఈ ఏడాది జూలై 31 వ‌ర‌కు గ‌డువు ఉంది. అయితే, అంత‌కంటే ముందుగానే మూడు నెల‌ల ముందే వాటికి ఎన్నిక‌లు నిర్వహించాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఇలా ముంద‌స్తుగా నిర్వహించుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాల‌కు పంచాయ‌తీ చ‌ట్టం అవ‌కాశం క‌ల్పించింది. దీనినే ఆయ‌న విప‌క్షాల‌పై క‌త్తిగా వినియోగించాల‌ని నిర్ణయించుకున్నారు. ఇక‌, కొత్త పంచాయ‌తీలు, వాటి విధులు, విధానాలు, పాల‌క‌వ‌ర్గం గ‌డువు త‌దిత‌ర అంశాల‌పై కేసీఆర్ ఇప్పటికే నియ‌మించిన ఐదుగురు మంత్రుల క‌మిటీ త‌న నివేదిక‌ను కేసీఆర్‌కు అందించింది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ విప‌క్షాల‌కు ఉరుకులు, ప‌రుగులు పెట్టించేలా ఎన్నిక‌ల వ్యూహానికి ప‌దును పెంచారు.

వచ్చే నెల రెండో వారంలో….

ఫిబ్రవ‌రిలో రెండో వారంలో ఎన్నిక‌లు నిర్వహించ‌డం ద్వారా విప‌క్షాల కంటిపై కునుకు లేకుండా చేయాల‌నేది కేసీఆర్ ప్రధాన ఎత్తుగ‌డ‌. ఒక‌వేళ చ‌ట్టం ప‌రంగా ఏదైనా ఇబ్బందులు త‌లెత్తినా త‌ట్టుకునేలా కూడా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవ‌రిలో ఎన్నిక‌లు నిర్వహించినా చ‌ట్టప‌ర‌మైన చిక్కులేమీ ఉండ‌బోవ‌ని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నిక‌ల నిర్వహ‌ణ అనంత‌రం కొత్తగా ఎన్నికైన వారు శిక్షణ‌, క్షేత్ర అవ‌గాహన పూర్తి చేసుకుని ఆగ‌స్టు 1న బాధ్యత‌లు చేప‌ట్టేలా ఇప్పటికే టైం టేబుల్‌ను కూడా కేసీఆర్ రెడీ చేస్తున్నారు. ఇక‌, పంచాయ‌తీల్లో కేసీఆర్‌కు అనుకూలంగా ప్రజ‌లు యూట‌ర్న్ తీసుకునేలా రైతుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉచిత 24 గంట‌ల విద్యుత్‌ను ప్రక‌టించిన ఆయ‌న ప‌ట్టాదారు పాసుపుస్తకాల‌కు కొత్త రూపు ఇచ్చి మ‌ళ్లీ ప‌క‌డ్బందీగా వాటిని పంపిణీ చేస్తున్నారు.

విపక్షాలకు సమయం లేకుండా చేయాలని….

అదే విధంగా తండాల‌ను జ‌నాభా వారిగీ విభ‌జించి పంచాయ‌తీలుగా గుర్తించే క్రతువును త్వర‌లోనే ప‌ట్టాలెక్కించ‌నున్నారు. ఇక‌, ఈ నిర్ణయంతో కాంగ్రెస్ స‌హా అన్ని విప‌క్షాల‌ను కేసీఆర్ ఆత్మర‌క్షణ‌లో ప‌డేయాల‌ని భావిస్తున్నారు. ప్రచారానికి, వారి అజెండా రూప‌క‌ల్పన‌కు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో అభ్యర్థుల‌పైనా ఒక నిర్ణయం వ‌చ్చేందుకు విప‌క్ష పార్టీల‌కు స‌మ‌యం ప‌డుతుంది. ఇది అంత త్వర‌గా తేలే అవ‌కాశం లేదు. ఇవ‌న్నీ పూర్తి చేసుకుని ప్రచారానికి వెళ్లేందుకు స‌మ‌యం లేకుండా చేయ‌డమే ఇప్పుడు కేసీఆర్ ముందున్న అస‌లు సిస‌లైన వ్యూహం. ఇక‌, అధికార పార్టీ విష‌యానికి వ‌స్తే… ఇప్పటికే తీసుకున్న ప‌లు నిర్ణయాలు గ్రామాల్లో కేసీఆర్ కు బ్రహ్మర‌థం ప‌డుతున్నాయి. ఈ వేడి త‌గ్గక‌ముందే తాను ఎన్నిక‌ల రంగంలోకి దూక‌డం ద్వారా 2019 ఎన్నిక‌ల్లో సునాయాస గెలుపును సాధించాల‌ని గులాబీ బాస్ స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. సో.. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు వ‌ర్కవుట్ అవుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*