గోకరాజుకు దీని కంటే అదే ఎక్కువయిందా?

కొంద‌రు ప్ర‌జాసేవ కోసమే రాజ‌కీయాల్లోకి వ‌స్తారు. మ‌రికొంద‌రు రాజ‌కీయాల కోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌స్తారు. ఇంకొంద‌రు.. రాజ‌కీయాల‌ను అడ్డుపెట్టుకునేందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తారు!! మ‌రి వీటిలో త‌మ ఎంపీ ఏ కోవ‌కు చెందిన‌వారో తెలియ‌క ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు త‌ల‌కిందులు అవుతున్నారు. ఈ జిల్లాల్లో చేప‌ల చెరువుల రైతులు ఎక్కువ‌. అదేవిధంగా వ్య‌వ‌సాయం కూడా జోరుగా సాగుతోంది. అలాంటి ప్రాంతంలో గ‌త కొన్నాళ్లుగా ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. మ‌రి వీళ్ల క‌ష్టాలు తీర్చి, న‌ష్టాల స‌మ‌యంలో ఆదుకోవాల్సిన ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు మాత్రం కంటికి క‌నిపించ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్నార‌ని స్థానికులు ఉవ్వెత్తున ఎగిరి ప‌డుతున్నారు. త‌మ స‌మ‌స్య‌లు తీర్చేవారు ఎవ‌రా? అని ఎదురు చూస్తున్నారు కూడా.

నరసాపురంలో ఎక్కడా కనిపించడం లేదే?

2014 ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసిన గోక‌రాజు గంగ‌రాజు భారీ మెజారిటీతో గెలుపొందారు. రాజ‌కీయ కుటుంబం నుంచి రావ‌డం, సామాజిక కార్య‌క్ర‌మాల్లో పేరుండ‌డం, బీజేపీ, టీడీపీ పొత్తు కార‌ణంగా ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. ఆర్ఎస్ఎస్ జోక్యంతో చివ‌రి క్ష‌ణంలో ఆయ‌న టిక్కెట్ ద‌క్కించుకున్నారు. అయితే, ఆ త‌ర్వాత దాదాపుగా గోదావ‌రి పుష్క‌రాల స‌మ‌యంలో త‌ప్ప న‌ర‌సాపురంలో ఆయ‌న క‌నిపించ‌లేద‌నేది స్థానికుల మాట. లైలా గ్రూప్ అధినేత అయినా గంగ‌రాజు.. అటు క్రికెట్‌లోను ప్ర‌ముఖంగా చ‌క్రం తిప్పుతున్నారు. బీసీసీఐ ఉపాధ్య‌క్షుడుగా ఆయ‌న ఎన్నిక‌య్యారు. దీంతో ఇప్ప‌డు ఎక్కువ‌గా హైద‌రాబాద్‌, ముంబై ప్రాంతాల‌కే ఆయ‌న ప‌రిమిత‌మ‌వుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

యాక్టివ్ గా లేకపోవడంతో….

అయితే, రాజకీయంగా మాత్రం యాక్టివ్‌గా క‌నిపించ‌డం లేదు. ఈయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని తుందుర్రు ఆక్వా ప‌రిశ్ర‌మ విష‌యం ఇప్ప‌టికీ ర‌గులుతున్న అగ్నిప‌ర్వ‌తం మాదిరిగానే ఉంది. గోక‌రాజు బంధువులే దీనిని ద‌క్కించుకోవ‌డం, కేంద్రం నుంచి గ‌ట్టి మ‌ద్ద‌తు ఉండ‌డంతో ఈ ప్రాజెక్టుకు స్థానికుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. రాష్ట్ర ప్ర‌భుత్వం పోలీసుల‌ను అడ్డు పెట్టి మ‌రీ ప‌నిచేస్తోంద‌ని ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌, ఆవేద‌న కూడా వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనూ స్థానిక రైతులు త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. అయినా కూడా వారి క‌ష్టాలు ఎక్క‌డా ప‌రిష్కారం కాలేదు. ఇక‌, రైతు రుణ మాఫీ ప్ర‌క్రియ లోనూ టీడీపీకి సంబంధించిన వారికే ఎక్కువ‌గా జ‌రుగుతోంద‌ని, మిగిలిన వారికి ఎక్క‌డా రుణమాఫీ కావ‌డం లేద‌నే ఫిర్యాదులు వ‌చ్చాయి. అయినా కూడా వీటిని ప‌ట్టించుకునే నాధుడు క‌నిపించ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని పార్టీ అధిష్టానం భావిస్తున్నా.. ఎంపీగా ఉన్న గోక‌రాజు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మీడియాముందుకు వ‌చ్చిందీ లేదు. తాను ఏం చేస్తోందీ చెబుతున్న‌దీ లేదు.

లోక్ సభ జరుగుతున్నా….

ఇక‌, ప్ర‌స్తుతం ఏపీ విభ‌జ‌న చ‌ట్టం హామీల అమ‌లు, బ‌డ్జెట్‌లో కేంద్ర నిధులు కేటాయించ‌క‌పోవ‌డం వంటి కీల‌క ప‌రిణామాల‌పై మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ పార్ల‌మెంటులో తీవ్ర ర‌గ‌డ సృష్టిస్తోంది. బీజేపీని తూర్పార‌బ‌డుతోంది. మ‌రి ఈ క్ర‌మంలో రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీగా గోక‌రాజు.. ఎలాంటి స‌మాధాన‌మూ చెప్ప‌డం లేదు. మిత్ర‌ప‌క్షం టీడీపీని స‌మ‌ర్ధించ‌డ‌మో.. లేక విమ‌ర్శించ‌డ‌మో కూడా ఆయ‌న చేయ‌డంలేదు. అంతెందుకు.. అసలు పార్ల‌మెంటులోనూ ఆయ‌న ఫేస్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇటు నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ఆయ‌న ఎప్పుడు వ‌స్తున్నారో ? ఎప్పుడు వెళుతున్నారో ? ఎవ్వ‌రికి తెలియ‌దు. ఆయ‌న ఈ డెల్టా నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేమీ లేదు ఆయ‌న వ్యాపారాలు చ‌క్క‌పెట్టుకోవ‌డం త‌ప్ప అన్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి.

సారు ఎక్కడంటున్న….

దీంతో న‌ర‌సాపురం ప్ర‌జలు ఇప్పుడు.. సార్‌.. ఎంపీ గోక‌రాజు ఎక్క‌డున్నారో చెప్తారా? ప్లీజ్‌!! అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ప‌రిస్థితి ఇదే విధంగా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు బీజేపీ టిక్కెట్ ఇచ్చినా ప్ర‌జ‌లు మాత్రం గెలిపించే ప‌రిస్థితి లేద‌నే అంటున్నారు ఆయా విష‌యాల‌ను ప‌రిశీలిస్తున్న విశ్లేష‌కులు. మ‌రి గంగ‌రాజు ఇప్ప‌టికైనా సొంత వ్యాపారాలు వ‌దుల‌కుని రాజ‌కీయాల్లోకి వ‌స్తాడో లేదో చూడాలి.