చంద్రబాబు ఈరోజు చెప్పేస్తారా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారి పోతోంది. ముఖ్యనేతలందరూ పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఉన్న వారితో పార్టీని నెట్టుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నంత వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవో ఒక కార్యక్రమాలు చేసేవారు. కొద్దోగొప్పో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేవారు. రేవంత్ రెడ్డి పార్టీని వీడి వెళ్లిన తర్వాత తెలుగుదేశం అసలు ఉన్నట్లా? లేనట్లా అన్నట్లు తయారైంది. ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ పరంగా చేసే కార్యక్రమాలు లేవనే చెప్పాలి. ఆయన సొంతంగా కార్యక్రమాలను రూపొందించుకున్న దాఖలాలు లేవు.

పట్టించుకోకుండా వదిలేసి…..

పార్టీ పరిస్థితి తెలంగాణలో దిగజారుతుందని తెలిసినా ఏపీ వ్యవహారాల్లో తలమునకలై ఉన్న చంద్రబాబు ఇక్కడ పట్టించుకోవడం లేదు. నెలకొకసారి ఇక్కడకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని, క్యాడర్ కు ధైర్యం నూరిపోస్తానన్న చంద్రబాబు ఇటువైపు రావడం మానేశారు. దీంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే వెళదామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఈ ప్రకటనతోనే నేతలు కొంత గందరగోళంలో పడినట్లు తెలిసింది.

నేడు తెలంగాణ మహానాడు…..

అయితే ఈరోజు తెలంగాణ తెలుగుదేశం మహానాడు హైదరాబాాద్ లో జరగుతుంది. ఈ మహానాడుకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ మహానాడులోనైనా దిశానిర్దేశం చంద్రబాబు చేస్తారని నేతలు భావిస్తున్నారు. పొత్తు కాంగ్రెస్ తో ఉంటుందా? టీఆర్ఎస్ తో ఉంటుందా? అన్న స్పష్టత వస్తే జనంలోకి వెళ్లవచ్చన్నది నేతల భావన. అయితే ఎన్నికల ముందే పొత్తు ప్రస్తావన ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఈరోజు చంద్రబాబుతో జరిగే భేటీలో ఈ విషయాలను టీటీడీపీ నేతలు గట్టిగానే ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు.

తీర్మానాలను బట్టే…….

తెలంగాణలో మినీ మహానాడులు పార్లమెంటు నియోజవర్గాల పరిధిలో జరిగాయి. మొత్తం 19 చోట్ల మినీ మహానాడులు జరిగాయి. అయితే ఈ కార్యక్రమాలకు క్యాడర్ హాజరు బాగానే ఉండటంతో కొంత ఉత్సాహం తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో ప్రారంభమైంది. ఈరోజు జరిగే మహానాడులో తెలంగాణ రాజకీయ తీర్మానాలు కూడా ఉంటాయి. ఈ తీర్మానాలను బట్టే పొత్తు ఎవరితో ఉంటుందని అర్థమవుతుందని టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తం మీద చంద్రబాబు ఈరోజైనా తెలంగాణ టీడీపీ నేతలకు స్పష్టత ఇస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*