చంద్రబాబు ఎందుకు ఇలా మారారు?

చంద్రబాబు ఎలాస్టిక్ లాంటి వారు. లాగే కొద్దీ సాగుతారు. ఆయన చేసే ప్రతిపనీ భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని చేస్తారన్నది తెలుగుతమ్ముళ్ల నిశ్చితాభిప్రాయం. అది ప్రభుత్వ కార్యక్రమమైనా కావచ్చు. పార్టీ పరంగానైనా కావచ్చు. అయితే ఇటీవల చంద్రబాబులో ఛేంజ్ స్పష్టంగా కన్పిస్తుందంటున్నారు. పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కులాల వారీగా పదవులను కేటాయించారని అంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు. గతానికి భిన్నంగా బాబు లో స్పష్టమైన మార్పు కొట్టొచ్చినట్లు కన్పిస్తుందంటున్నారు. ఇందుకు ఎమ్మెల్సీ పదవుల్లో అభ్యర్థులను ఎంపికనే ఉదహరిస్తున్నారు.

పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే….

చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయడంలో చాణక్య నీతిని ప్రదర్శించారని భావిస్తున్నారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల సమరంలో గెలుపు బాటలో పయనించేలా అభ్యర్థుల ఎంపిక ఉందని సీనియర్ నేతలు బాబుకు కితాబిస్తున్నారు. ఎనిమిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖరారు చేసిన అభ్యర్థుల్లో రెడ్లు, కాపులు, రాజులు, బీసీలకు స్థానం కల్పించారు. అయితే వీరి ఎంపికలో కులాలను పక్కన బెట్టి కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే కోటా కింద ఐదుగురు అభ్యర్థులను ఖారారు చేయగా అందులో ఇద్దరు కమ్మ, ఒక ఎస్సీ, ఇద్దరు బీసీ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందులో మాత్రం పార్టీ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఎంపిక జరిగిందని తెలుస్తోంది. ఇక మంత్రివర్గ కూర్పు కూడా చంద్రబాబు ఇదే స్టయిల్ చేస్తారని అనుకుంటున్నారు. ప్రతిపక్షానికి దీటుగా సమాధానం చెప్పే మంత్రులు ఇద్దరు, ముగ్గురు మినహా లేకపోవడం చంద్రబాబును ఆగ్రహానికి గురిచేస్తోంది. అందుకోసం మంత్రివర్గంలోనూ తనదైన ముద్రను ఆయన చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మంత్రులకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడేళ్లు ఇప్పటికే అవకాశమిచ్చినా ప్రూవ్ చేసుకోలేక పోయారని, ఇక ఉపేక్షిస్తూ వెళితే పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదముందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరిపై వేటు పడనుందోనన్న టెన్షన్ లో అమాత్యులున్నారు. అయితే చంద్రబాబు లో వచ్చిన ఈ మార్పుకు కొందరు సంతోష పడుతుండగా…మరికొందరు మాత్రం ప్చ్….అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*