చంద్రబాబు కొంత తగ్గుతున్నారా?

కేంద్రం ఇచ్చానంటుంది. రాష్ట్రం ఇవ్వలేందంటుంది. నిజంగా ఎవరి మాటలో నిజముంది? ఇదీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. చంద్రబాబు నాయుడు ఇంతవరకూ పెదవి విప్పలేదు. రాష్ట్రానికి చాలా తక్కువ నిధులు కేంద్రం నుంచి వచ్చాయని చంద్రబాబు వివిధ సమావేశాలు, టెలికాన్ఫరెన్స్ లో చెబుతూ వస్తున్నారు. అయితే ఇదే సమయంలో బీజేపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పర్యటనలో లెక్కలు తేల్చాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. చిలికి చిలికి గాలివానాలా మారకముందే పరిస్థితిని చక్కదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు.

జేఎఫ్సీ బయటపెడితే…..

మరోవైపు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరుతో లెక్కలు తేల్చడానికి ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ రెడీ అయిపోయారు. రెండు పార్టీలను లెక్కలు అడిగారు. ఈనెల 15వ తేదీ వరకూ పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. 15వ తేదీలోగా కేంద్రం నుంచి ఎంత మేర నిధులు వచ్చాయో చెప్పాలన్నారు. అలాగే బీజేపీని కూడా ఎంత మేర కేంద్రం నిధులు రాష్ట్రానికి వచ్చాయో వివరించాలన్నారు. రెండు నివేదికలతో పాటు రాష్ట్ర, కేంద్ర అధికారులతో చర్చించి వాస్తవ పరిస్థితిని తేల్చాలన్నది పవన్ కమిటీ ఆలోచనగా కన్పిస్తోంది.

రెండురోజుల్లో చంద్రాబాబు హస్తినకు…..

అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులను పక్కదోవ పట్టించదన్నది బీజేపీ నేతల వాదన. కొన్ని కేంద్ర పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాల పేరుతో ఖర్చు చేసింది. ఇవన్నీ బయటపడితే చంద్రబాబుకు కొంత ఇబ్బంది తప్పదని చెబుతున్నారు రాష్ట్ర అధికారులు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను దారి మళ్లించిన మాట వాస్తవమేనని అంగీకరిస్తున్నారు ఏపీ అధికారులు. దీంతో లెక్కలు తేలితే చంద్రబాబు సర్కార్ దోషిగా తేలే అవకాశముందంటున్నారు. అందుకే చంద్రబాబు హస్తిన పర్యటన పెట్టుకున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి అరుణ్ జైట్లీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసే అవకాశముంది. మొత్తం మీద బీజేపీ కూడా వాయిస్ పెంచడంతో ఇప్పటి వరకూ బయటకు మాట్లాడని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి సమస్యను పరిష్కరించుకుందామన్న ఆలోచనలో పడ్డారని అమరాతిలో టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1