చంద్రబాబు పొత్తు ఈ పార్టీతోనేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చేశారా? జాతీయ కాంగ్రెస్ పార్టీతో రెండు తెలుగురాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మిత్రులెవ్వరూ లేరు. గత ఎన్నికల్లో మిత్రులుగా ఉన్నవారందరూ దూరమయ్యారు. దీంతో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనను తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చేస్తుందన్న టాక్ పార్టీలో నడుస్తుంది.

అందరినీ వదులుకుని….

ఆంధ్రప్రదేశ్ లో నిన్నమొన్నటి వరకూ కలిసి మెలిసి ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనలు విడిపోయాయి. ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఏర్పడింది. కమ్యునిస్టులు కూడా ఏపీలో టీడీపీతో కలిసేందుకు సుముఖంగా లేరు. గత నాలుగేళ్ల నుంచి తమను దూరంగా పెట్టడమే కాకుండా ఉద్యమాలను అణచివేసిన చంద్రబాబుతో పొత్తు వద్దనుకుంటున్నారు కామ్రేడ్లు. ఇక టీడీపీ ముందు ఉన్న ఆప్షన్ ఒక్కటే. అది కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమే.

కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు….

కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన కారణంగా ఏపీలో కోలుకోలేని పరిస్థితిలో ఉంది. గత ఎన్నికల్లో సింగిల్ సీట్ కూడా రాలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీ పరిస్థితి ఏపీలో ఘోరంగా ఉంది. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలుపర్చని బీజేపీపై ఏపీ ప్రజలు కసిగా ఉన్నారని టీడీపీ నమ్ముతోంది. అందుకే అలయన్స్ నుంచి బయటకు వచ్చింది. అయితే కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతోంది. ప్లీనరీలో కూడా తీర్మానం చేసింది. దీంతో కాంగ్రెస్ తో జత కడితే బాగుంటుందన్న చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది.

అధ్యయనం చేస్తున్న బాబు….

కాంగ్రెస్ కు ఐదు పార్లమెంటు స్థానాలు ఇస్తే సరిపోతుందన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. గతంలో వామపక్షాలకు, బీజేపీకి కూడా అన్నే సీట్లు ఇచ్చామన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇందుకు అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాలి. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ తమకు అన్నే స్థానాలు కేటాయించవచ్చన్నది వారి ప్రతిపాదనగా ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం కంటే కాంగ్రెస్ తో కలసి నడవడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. అధికార టీఆర్ఎస్ ను కాంగ్రెస్ మాత్రమే ఢీకొట్టనుంది. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఆ విధానాన్ని తుంగలో తొక్కి పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*