చంద్రబాబు రీఛార్జి అవుతుంది ఇలాగేనా?

చంద్రబాబు టెన్షన్ లేకుండా గత మూడు రోజుల నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరితోనో తెలుసా? మనవడు దేవాన్ష్ తో… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం బిజీగా ఉంటారు. ఆయన పని మీద పెట్టిన శ్రద్ధ మరి ఎవరూ పెట్టరు. రోజుకు దాదాపు 18గంటలు పనిచేసే చంద్రబాబుకు అలసట లేకుండా బిజీగా గడుపుతారు. పార్టీ కార్యక్రమాలు, అధికారిక పర్యటనలతో ఆయనకు తీరికంటూ ఉండదు. ప్రభుత్వ అధికారులతో సమీక్షలు, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలతో సతమతమవుతుంటారు. గతంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అదే తీరు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే చంద్రబాబు దైనిందిన కార్యక్రమం రాత్రికి 11 గంటలకు ముగిసేది. సచివాలయానికి వచ్చి తిరిగి రాత్రికి వెళుతూ పార్టీ కార్యాలయానికి చేరుకుని నేతలతో సమావేశమయ్యేవారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తాను ముఖ్యమంత్రిని కాదని ఏపీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ప్రకటించుకున్నారు.

సమయమంతా దేవాన్ష్ తోనే….

అయితే రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు వెళ్లిన చంద్రబాబు దాదాపు ఒంటరి జీవితమే గడుపుతున్నారు. చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ లోనే ఉంటుంది. శని, ఆదివారాల్లో మాత్రం చంద్రబాబు హైదరాబాద్ రావడమో…. కుటుంబం అమరావతి రావడమో జరుగుతుంటుంది. కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబుకు వరంలా మనవడు దేవాన్ష్ దొరికాడు. దేవాన్ష్ లేకుండా సెలవు రోజుల్లో ఎక్కడకీ వెళ్లడంలేదు. వీలయినంత సేపు మనవడితో గడుపుతుండటంతో ఆయన రీఛార్జి అవుతున్నారు. దేవాన్ష్ ముద్దు ముద్దు మాటలు… చిలిపి చేష్టలతో చంద్రబాబు ఫిదా అయిపోతున్నారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా చంద్రబాబు మనవడు దేవాన్ష్ తో కలిసి వచ్చారు. దేవాన్ష్ తో ఉన్నంతసేపూ చంద్రబాబు కూడా చిన్న పిల్లాడిలా మారిపోతున్నారు. వరుసగా దసరా సెలవలు రావడంతో పూర్తి సమయాన్ని చంద్రబాబు దేవాన్ష్ తోనే గడుపుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*