చంద్రబాబు స్ట్రెస్ ఫీలవుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యసూత్రాలు పాటిస్తారు. ఆయన ఈ వయసులోనూ ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నారంటే ఆయన ఆరోగ్యసూత్రాలే కారణమని చెప్పకతప్పదు. అయితే ఇటీవల చంద్రబాబు కొంత వత్తిడికి గురవుతున్నారు. పార్టీ పనులతో పాటు పాలనపరమైన వ్యవహారాలను కూడా తానే చూసుకుంటుండటంతో చంద్రబాబు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల దొండపాడు సభలో చంద్రబాబు అస్వస్థతకు గురికావడంపై పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ‘నేను నిద్రపోను…మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అన్నది చంద్రబాబు నినాదం. అలాగే ఆయన కష్టపడి పనిచేస్తున్నారు కూడా. రాష్ట్ర విభజనానంతరం తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మూడేళ్ల నుంచి కష్టపడుతున్న చంద్రబాబు ఫేస్ లో ఎప్పుడూ అలసట అనేది కన్పించదు. మిగిలిన మంత్రులు కొందరు అలసటగా కన్పించినా చంద్రబాబు మాత్రం ఎనీ టైమ్ హుషారుగానే ఉంటారు. కాని ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం, కేంద్రంలో పరిస్థితులు మారుతుండటం, నంద్యాల ఉప ఎన్నిక తదితర కారణాలతో చంద్రబాబు స్ట్రెస్ కు గురవుతున్నారు. అందుకోసమే ఆయన ఎప్పుడూ లేనిది బహిరంగ సభలో అలసటకు లోనయ్యారు.

రోజుకు 14 గంటలు పనిచేస్తూ…..

చంద్రబాబు అంతా తానే అయి చేయాలనుకుంటారు. పని విభజనకు ఆయన ససేమిరా అంటారు. ముఖ్యమంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అంతా తన కనుసన్నల్లోనే నడవాలంటారు. ఆయనకు నమ్మకంగా పనిచేసి పెట్టేవారు కూడా లేరు. తనయుడు లోకేష్ ఉన్నా ఇంకా రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటుండటంతో చంద్రబాబు అంతా ఒక్కరే చూసుకోవాల్సి వస్తోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే సీఎం షెడ్యూల్ రాత్రి పదిగంటలయినా ముగియడం లేదు. ఒక్కోసారి రాత్రి 12 గంటలు కూడా అవుతుంది. నంద్యాల ఉప ఎన్నిక రావడంతో రోజూ ఉదయాన్నే నేతలతో టెలికాన్ఫరెన్స్ ను దాదాపు గంటసేపు నిర్వహిస్తున్నారు. ఇక సమీక్షలు, సమావేశాలయితే సుదీర్ఘంగా సాగిపోతూనే ఉంటాయి. చంద్రబాబు నిత్యం యోగా చేస్తారు. మితాహారమే తీసుకుంటారు. ఆరోగ్యసూత్రాలను ఎంత పాటించినా…విశ్రాంతి లేకుంటే అస్వస్థతకు గురికాక ఏమవుతుందని టీడీపీ సీనియర్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. సీఎంను పరిమిత షెడ్యూల్ ను పెట్టుకోవాలని గత కొంతకాలంగా యనమల లాంటి సీనియర్ నేతలు సూచిస్తున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. దొండపాడులో జరిగిన సంఘటనతో సీఎం షెడ్యూల్ ను తగ్గించుకోవాలని పలువురు నేతలు సూచిస్తున్నారు. రాబోయేది ఎన్నికల సీజన్ కావడంతో ఇంకా చంద్రబాబు పై వత్తిడి పెరుగుతుందని, అందుకే ప్రస్తుతం ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని కొందరు సూచిస్తున్నారు. కొంత పని విభజన చేసి సీనియర్లకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న సూచనలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు ఆరోగ్యం మీద పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*