చంద్రయ్యా….చప్పట్లయ్యా?

టీవీలో ఒక ఫ్యాన్ యాడ్ మీరు చూసి ఉండి ఉంటారు.  అందులో అయ్యా…అంటూ చివరి వాక్యంలో భలే ముగించారు. ఆ యాడ్ మాదిరిగానే ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రతి అంశాన్ని చెబుతూ చప్పట్లు కొట్టించుకోవాలని చూస్తున్నారు. మన గొప్పను మ‌నమే చెప్పుకొంటే ఎలా ఉంటుంది? మ‌న గురించి మ‌న‌మే డ‌ప్పుకొట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇదిగో.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ప‌రిస్థితిలాగానే ఉంటుంది.. అంటున్నారు విశ్లేష‌కులు. తెల్లవారి లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కు ఎక్కడ వేదిక ఎక్కినా.. ఎక్కడ మైకు క‌నిపించినా.. పొగ‌డ‌రా నీత‌ల్లి భూమి భార‌తిని అన్నట్టుగా త‌న‌గురించి తాను పొగుడుకోవ‌డం, త‌న‌గురించి తాను గొప్పులు చెప్పుకోవ‌డం, రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోంద‌ని కితాబు లిచ్చుకోవ‌డం ష‌రా.. మామూలుగా వ్యవ‌హ‌రించరు చంద్రబాబు.

అభివృద్ధిలో దూసుకుపోతుందా?

నిజానికి రాష్ట్రంలో అలాంటి ప‌రిస్థితి ఉందా? రాష్ట్రం నిజంగానే అభివృద్ధిప‌థంలో దూసుకుపోతోందా? అన్నది ఆయ‌న అస్సలు ప‌ట్టించుకోలేదు. కేవ‌లం త‌న రిప్యుటేష‌న్ మాత్రమే చూసుకున్నారు. తాను న‌ల‌భై ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని, ఉమ్మడి ఏపీని తొమ్మిదేళ్లు పాలించాన‌ని, త‌న‌ముందు అంద‌రూ ఛోటాలేన‌ని భావించిన కార‌ణంగా ఆయ‌న నోటి నుంచి ఎప్పుడూ పేక మేడ‌ల్లాంటి అభివృద్ధి మాట‌లే వెల్లువెత్తాయి.

కేంద్రాన్ని మించిపోయామని చెబుతూ…

రెండంకెల వృద్ధిలో ఏపీ కేంద్ర ప్రభుత్వాన్నే మించిపోయింద‌ని చెప్పారు. నిజానికి అలాంటి ప‌రిస్థితి ఉంటే.. ఇప్పటికీ ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్రబాబు ప్రక‌టించిన నిరుద్యోగ భృతి ఏమైంది? అన్న క్యాంటీన్ల ఏర్పాటు విష‌యం ఎంత వ‌ర‌కు వ‌చ్చింది? ఈ హామీలు ఇప్పటికీ పేప‌ర్లపైనే ఉన్నాయి. మ‌రి ఏపీ రెండంకెల వృద్ధిలో ఉన్నప్పుడు ఆదాయం భారీ ఎత్తున ఖ‌జానాకు పోటెత్తాలి. ప‌న్నుల వ‌సూళ్లు పెరిగి.. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వ‌చ్చి ఉండాలి.

యనమల వేరే విధంగా….

కానీ, ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాత్రం ఏ వేదిక ఎక్కినా.. ఎవ‌రు త‌మ జీతాలు పెంచాల‌ని డిమాండ్ చేసినా.. ఖ‌జానా ఖ‌ల్లాస్ అంటూ చేతులు ఎత్తేస్తున్నారు. ఇక‌, ప‌లు మార్లు చంద్రబాబు సైతం ఉద్యోగులు జీతాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం నానా ఇబ్బందులు ప‌డుతోందంటారు. కొన్ని సంద‌ర్భాల్లో ఏపీ దూసుకు పోతోంద‌ని చెబుతారు. ఇక‌, విశాఖలో ఏటా నిర్వహిస్తున్న పెట్టుబ‌డుల స‌ద‌స్సుల ద్వారా వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు పోటెత్తుతున్నాయ‌ని ప్రక‌ట‌న‌లు గుప్పిస్తున్నారు.

కేంద్రంపైకి నెపాన్ని నెడుతూ….

తీరా.. వాటి ఏర్పాటు విష‌యం ప్రశ్నించే స‌రికి.. కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేదు. అందుకే పెట్టుబడులు కూడా వెన‌క్కి పోతున్నాయ‌ని సెల‌విస్తారు. ప‌లు ప్రభుత్వ ప‌థ‌కాల విష‌యంలో ప్రభుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి.. కాంట్రాక్టర్లకు, తెలుగుదేశం పార్టీ త‌మ్ముళ్లకు వ‌రంగా మారింద‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పోల‌వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్ట‌రును మార్చే వ‌ర‌కు చంద్రబాబు నిద్రపోలేదు. దీనిని కేంద్రం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక స‌మ‌స్యల‌తో ఇబ్బందులు ప‌డుతున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం లెక్క చేయ‌కుండా ఎన్నిక‌ల్లో గెలుపే ప‌ర‌మావ‌ధిగా వాటిని కూడా భుజాన వేసుకుంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బాబు చేస్తున్న అతి కార‌ణంగా కేంద్రం కూడా రాష్ట్రంపై శీత‌క‌న్నేయ‌డానికి కార‌ణ‌మైంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో.. ఇదీ న‌ల‌భై ఏళ్ల బాబు రాజ‌కీయ అనుభ‌వం!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*