చంద్ర‌బాబు కొత్త ట్విస్ట్‌..ప్రజలు నమ్ముతారా?

`ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిని నిర్మించే మ‌హ‌త్త‌రమైన అవ‌కాశం వ‌చ్చింది.. దేశం గ‌ర్వించే రీతిలో అత్యుత్త‌మ ప్ర‌మాణా ల‌తో అమ‌రావ‌తిని నిర్మిస్తాం` అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఇదే పాట పాడుతున్నారు.. బోల్డ‌న్ని సార్లు అమ‌రావ‌తి నిర్మాణానికి శంకుస్థాప‌న‌లు చేశారు. రైతుల నుంచి 33వేల ఎక‌రాలు తీసుకున్నారు.. కానీ ఇప్పుడు అక్క‌డ ప‌రిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. రాజ‌ధానికి రూ.1500 కోట్లు ఇచ్చామ‌ని కేంద్రం చెబుతోంది. మ‌రి ఈ డ‌బ్బు వేటికి మ‌ళ్లించిన‌ట్లు అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే రాక‌మాన‌దు. ఇప్పుడు రాజ‌ధాని నిర్మాణం విష‌యంలో చంద్ర బాబు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ అమ‌రావ‌తి నిర్మాణానికి అప్పు ఇవ్వాలని కోరుతున్నారు. విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌లేద‌ని కేంద్రంపై త‌ప్పు నెట్టేస్తున్న ఆయ‌న‌.. ఇప్పుడు అమ‌రావ‌తి కూడా కేంద్రం వల్లే ఆగిపోయింద‌నేలా మాట్లాడుతూ మ‌భ్య పెడుతున్నార‌ని అధికార వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈర్ష్య పడేలా రాజధానిని నిర్మిస్తామని….

విభ‌జ‌న చేసిన వాళ్లు కూడా ఈర్ష్య ప‌డేలా రాజ‌ధాని నిర్మిస్తామంటూ.. సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న నాటి నుంచి చంద్ర‌బాబు ఇదే మాట చెబుతున్నారు. లోటు బ‌డ్జెట్‌తో రాష్ట్ర ప్ర‌యాణం మొద‌లైందంటూనే.. అమ‌రావ‌తి నిర్మాణంలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేసేందుకు తొలినాళ్లో `మై బ్రిక్-మై అమరావ‌తి` అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఇటుక‌ల‌ను కొంటే వాటిపై వాళ్ల పేర్లు రాస్తామ‌ని విప‌రీతంగా ప్రచారం చేయ‌డంతో అంతా చేయూత నందించారు. ఇప్పుడు ఇలాంటి కార్య‌క్ర‌మానికే చంద్ర‌బాబు మ‌ళ్లీ తెర‌తీశారు. అమ‌రావ‌తి నిర్మాణానికి కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని, రాజ‌ధాని నిర్మాణంలో ప్ర‌జ‌లు భాగ‌స్వాములు కావాల‌ని మ‌రోసారి పిలుపునిచ్చారు. అందుకే అంతా అప్పులివ్వాల‌ని, ఇలా ఇస్తే వారికి బాండ్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఆ నిధులేం చేశారు?

బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే తాము అధికంగా ఇస్తామని ఎన్ఆర్ఐలతోపాటు..అందరూ ఇందులో పెట్టుబడి పెట్టాలని కోరుతున్నారు. అంటే బాండ్లకు స్పందన వస్తే తప్ప రాజధాని పూర్తి కాదా? అనే చ‌ర్చ మొద‌లైంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? రాజధాని నిర్మాణం కోసం అంటూ కేంద్రం ఇచ్చిన రూ.1500 కోట్లు వేరేవాటికి మళ్లించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు రాజధాని కోసం పూలింగ్ లో ఇచ్చేశారు. వాస్తవంగా స్థలం కొత్తగా కొనాల్సిన అవసరం లేదు కాబట్టి రూ.1500 కోట్లతో అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ వంటి నిర్మాణాలను అద్బుతంగా పూర్తి చేయవచ్చని అధికారులే చెబుతున్నారు. మౌలికసదుపాయాలు ప్రభుత్వ ఖర్చుతో సమకూర్చుకుంటే ఇఫ్పటికే రాజధాని పూర్తయ్యేదని వివ‌రిస్తున్నారు.

మరోసారి సెంటిమెంట్ తో……

రాజధాని అంటే సహజంగా సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాలు ఉంటాయి. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు ఉంటాయి. వీటికి అయ్యే వ్యయం ఎంత ఉంటుందో లెక్కించి కేంద్రాన్ని అడగాలిగానీ 50 వేల ఎకరాల్లో రాజ‌ధాని నిర్మిస్తాం. ఈ మొత్తం కేంద్రం భరించాలంటే ఎవరు ముందుకొస్తారని ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. ప్రజల సెంటిమెంట్ తో ఆడుకునేందుకు చంద్ర‌బాబు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు తీరుతో రాజధానికి భూములిచ్చిన రైతులతోపాటు ప్రజలు నిరాశకు గురి కావల్సి వస్తోందనే చర్చ మొద‌లైంది. చంద్రబాబు అమ‌రావ‌తి ఆట‌లు మొద‌లెట్టార‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రి వీటికి ముగింపు ఎప్పుడో!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*