చిరంజీవి ఇంతకీ ఎక్కడ ..?

తాను ఎంతో ఇష్టపడి పెట్టుకున్న ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసేసారు. అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ ఆయన్ను రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవించి కేంద్రమంత్రిని సైతం చేసింది. సీన్ కట్ చేస్తే ఏపీ పునర్విభజన తరువాత కాంగ్రెస్ చతికిల పడింది. తెలంగాణాలో కొద్దొ గొప్పో స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని ప్రతిపక్ష స్థానానికైనా పరిమితం అయ్యింది. ఏపీ లో నామరూపాలు లేకుండా చతికిలపడి ఒక్క సీటు అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కి కానీ దక్కించుకోలేక పోయింది. ఇలాంటి పరిస్థితిలో ఏపీ కాంగ్రెస్ ఆశాకిరణం చిరంజీవి ఏదో ఒకరకంగా ప్రజల్లో తిరిగి తమ పార్టీ పునర్ వైభవానికి కృషి చేస్తారని సగటు పార్టీ అభిమాని భావించాడు. పార్టీలో ఇక చిరు హవా స్టార్ట్ అవుతుంది అనుకున్న దశలో కట్ చేస్తే మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 తో సినిమాల్లో బిజీ అయిపోయారు.

పార్టీకి ఏమి చేసినా ఫలితం లేదనే ….?

ఏపీలో కాపు సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంక్ కలిగివుంది. అలాంటి బలమైన సామాజిక వర్గం అండగా వున్నా మెగాస్టార్ పార్టీలో శూన్యతను భర్తీ చేయడంలో విఫలం అయ్యారు. కీలకమైన పార్టీ సభలు, సమావేశాలకు చిరంజీవి దూరంగా వుంటూ వస్తున్నారు. ఇదే కష్టకాలంలో వున్న కాంగ్రెస్ ను మరింత కలవరపెడుతుంది. చిరంజీవి వంటి చరిష్మా వున్న లీడర్ ఇప్పుడు ప్రజల్లో తిరిగితే ఎంతో కొంత మార్పు కనపడుతుందని పలువురు కాంగీయులు వాపోతున్నారు.

తమ్ముడు పార్టీ పెట్టాడనేనా ?

మెగాస్టార్ రాజకీయ మౌనానికి జనసేన పార్టీతో తమ్ముడు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడమే కారణమని మరికొందరు భావిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సైతం అన్న గారిని ఆకాశానికి ఎత్తేశారు. చిరంజీవి అమాయకుడు అంటూ ఆయనలా తాను పొసపోనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పరిశీలించిన కొందరు అన్నదమ్ముల నడుమ అండర్ స్టాండింగ్ వుండే వ్యవహారం నడుస్తున్నట్లు కూడా భావిస్తున్నారు.

గతంలో పోలవరం కోసం బస్సు యాత్ర చేసిన చిరు ……

ప్రజారాజ్యం పార్టీ విలీనం కాకముందు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం చిరంజీవి బస్సు యాత్ర చేపట్టారు. అదే మెగాస్టార్ పోలవరం కోసం కాంగ్రెస్ మహా పాదయాత్రకు హాజరు కాలేదు సరికదా కనీసం తన సందేశాన్ని అయినా పంపలేదు. మాజీ కేంద్రమంత్రులు, మాజీ రాష్ట్రమంత్రులు నేతలు పాల్గొన్న భారీ కార్యక్రమంలో ఆయన ఉనికే లేకుండా పోయింది. దాంతో చాలామంది నేతలు, కార్యకర్తలు అసలు చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నారా లేదా అన్న సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*